మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 మే 2021 (09:14 IST)

మరణం కూడా అత్యంత ఖరీదు... అంత్యక్రియలకు ధర ఫిక్స్.. ఎక్కడ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో మరణం కూడా అత్యంత ఖరీదుగా మారింది. ఈ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో అంత్యక్రియలకు కూడా ఓ ధరను ఫిక్స్ చేశారు. తద్వార కరోనా కష్టకాలంలోనూ చావులపై పేలాలు వేరుకుంటున్నారు. 
 
చావుల్లో రకాలు చూపుతూ డబ్బులు దండుకుంటున్నారు. సాధారణ చావుకైతే రూ.2,200, కరోనా మరణానికైతే రూ.5,100 రేటు కట్టి మరీ దోచుకుంటున్నారు. ఇలా సాక్షాత్తు గుంటూరు నగర పాలక సంస్థే చేస్తున్నట్లు కనిపిస్తోంది. 
 
ఇచ్చట దహన సంస్కారాలు చేయబడునంటూ పాత గుంటూరు హిందూ శ్మశాన వాటిక గోడపై రాశారు. టోల్ ఫ్రీ నెంబర్‌ను కూడా జత చేశారు. ఈ రాతను చూసిన కొందరు ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 
 
మనిషి చనిపోయిన తర్వాత కూడా వారికి మనశ్శాంతి లేదని, ఇది రాష్ట్ర దౌర్భాగ్యమని విమర్శలు చేస్తున్నారు. అయితే ఇది నిజంగా గుంటూరు నగర పాలక సంస్థే రాసిందా? లేదా బయట వ్యక్తులు రాశారా? అనేది తెలియాల్సి ఉంది.
 
అయితే, గుంటూరు నగరంలోని శ్మశానాల్లో అంత్యక్రియల ఖర్చులకు, నగరపాలక సంస్థకు ఎటువంటి సంబంధం లేదని నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ ఆదివారం తెలిపారు. అంత్యక్రియల ఖర్చుల సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని శ్మశాన వాటిక కమిటీ ప్రతినిధులను ఆదేశించామన్నారు. 
 
పాత గుంటూరులో తప్పుగా ము ద్రించిన సూచిక బోర్డును సవరణ చేయిస్తామన్నా రు. అనాథ శవాల అంత్యక్రియలకు జీఎంసీ పూర్తి బాధ్యత వహిస్తుందన్నారు. అంత్యక్రియలకు అధిక మొత్తంలో వసూలు చేస్తే 0863-2345105 టోల్‌ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేయాలన్నారు.