గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 జూన్ 2020 (21:12 IST)

గుంటూరులో ఇంటి అద్దె చెల్లించలేక వ్యక్తి ఆత్మహత్య

కరోనా వైరస్ మహమ్మారి ప్రతి ఒక్కరి జీవితాలను ప్రశ్నార్థకంలోకి నెట్టేసింది. ఈ వైరస్ పుణ్యమాని దేశం మొత్తం లాక్డౌన్‌లోకి వెళ్ళిపోయింది. ఫలితంగా అనేక మంది ఉపాధిని కోల్పోయారు. దీంతో ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. అనేక మంది తినేందుకు తిండిలేక అమలటిస్తున్నారు. ఇంకొందరు ఇంటి అద్దెలు చెల్లించలేక అష్టకష్టాలుపడుతున్నారు. 
 
తాజాగా గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తిని ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. దీంతో ఇంటి అద్దె చెల్లించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానిక పోలీసు వర్గాల సమాచారం మేరకు.. మృతుడిని షేక్ జాన్ బాబుగా గుర్తించారు. 
 
నూడిల్ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తూ వచ్చిన ఈ చిరువ్యాపారి.. లాక్డౌన్ కారణంగా ఆర్థిక కష్టాల్లో కూరుకునిపోయాడు. దీంతో ఇంటి అద్దెను చెల్లించలేక పోయాడు. అదేసమయంలో అద్దె చెల్లించాలంటూ ఇంటి యజమాని ఒత్తిడి చేయడంతో ఇంట్లోనే ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఇంటి అద్దె చెల్లించలేదని ఇంటి యజమాని దుర్భాషలాడటం వల్లే షేక్ జాన్ బాబు ఆత్మహత్యకు పాల్పడినట్టు మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.