జగన్మోహన్ రెడ్డి ఖాతాలో కొత్త రికార్డు.. వైఎస్సార్ తనయుడు సీఎంగా?  
                                       
                  
				  				  
				   
                  				  వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి కొత్త రికార్డును తన పేరిట లిఖించుకోనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తండ్రి తర్వాత రాష్ట్రానికి సీఎం అయిన తొలి వ్యక్తిగా జగన్ రికార్డు సృష్టించబోతున్నారు. ఉమ్మడి ఏపీలో సీఎం బాధ్యతలు చేపట్టిన దివంగత సీఎం వైఎస్సార్ రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. 
	
				  
	 
	ఆయన తనయుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ మరణం తరువాత రాష్ట్రానికి సీఎం అయ్యేందుకు ప్రయత్నించి విఫలయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్‌ను వీడి వైసీపీని స్థాపించిన జగన్, ఏపీ రాజకీయాలకే పరిమితం అయ్యారు. 2014లో అధికారంలోకి రాలేకపోయినా.. 2019లో తాను అనుకున్నది సాధించారు. 
				  											
																													
									  
	 
	వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ముందు అనేక మంది నేతలు ఏపీకి ముఖ్యమంత్రులుగా పని చేశారు. అయితే వారి వారసులెవరూ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు కాలేకపోయారు. ఆ రికార్డును ప్రస్తుతం జగన్ సృష్టించబోతున్నారు. మాజీ ముఖ్యమంత్రులు పీవీ నరసింహారావు, ఎన్టీ రామారావు, కాసు బ్రహ్మనందరెడ్డి రాజకీయ వారసులు మంత్రులుగా పని చేసినా... సీఎం స్థాయికి మాత్రం ఎదగలేకపోయారు. 
				  
	 
	దీంతో ఈ బ్యాడ్ సెంటిమెంట్ జగన్‌ను కూడా వెంటాడుతుందని అందరూ అనుకున్నారు. కానీ తండ్రి అడుగుజాడల్లో నడిచిన జగన్ పాదయాత్ర, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ప్రజల్లోకి వచ్చారు. ఆ కారణాలే ఆయన్ని సీఎంగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్నాయి.