గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 10 ఫిబ్రవరి 2019 (12:36 IST)

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడినయ్యా.. అయితే మాకేంటి... కన్నా వర్సెస్ పోలీసులు

ప్రధాని నరేంద్ర మోడీ గుంటూరు పర్యటన వేళ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు తీవ్ర అవమానం జరిగింది. మోడీకి స్వాగతం పలికేందుకు ఆయన ఎయిర్‌పోర్టుకు రాగా, పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. ఎయిర్‌పోర్టులోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అయినప్పటికీ పోలీసులు ఏమాత్రం వెనక్కితగ్గలేదు. దీంతో పోలీసులతో కన్నా వాగ్వివాదం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గుంటూరు పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ ఆదివారం ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానంలో వచ్చారు. ఆయనకు స్వాగతం పలికేందుకు కన్నాతో పాటు.. పలువురు బీజేపీ నేతలు ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. అయితే, కన్నాకు మాత్రం గన్నవరం ఎయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదురైంది.
 
మోడీకి స్వాగతం పలికేందుకు వెళ్లిన ఆయన్ను పోలీసులు లోపలికి అనుమతించలేదు. సీఎంవో కార్యాలయం నుంచి వచ్చిన జాబితాలో కన్నా పేరు లేదన్న కారణంతో సెక్యూరిటీ ఆయన్ను అడ్డుకున్నారు. తాను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని అని.. మోడీతో కలిసి గుంటూరు వెళ్లాల్సి ఉందని కన్నా పోలీసులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. వారు పట్టించుకోలేదు. దీంతో పోలీసుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఆయన అక్కడినుంచి వెనక్కి వెళ్లారు.
 
ఇదిలావుంటే, ప్రధాని రాకవేళ స్వాగతం పలికేందుకు వెళ్లకూడదని సీఎంవో కార్యాలయంతో పాటు, మంత్రులు నిర్ణయించారు. మరోవైపు గవర్నర్ నరసింహన్ ఉదయాన్నే హైదరాబాద్ నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ బయలుదేరారు. గుంటూరు, విజయవాడల్లో మోడీ పాల్గొనే కార్యక్రమాల్లో నరసింహన్ పాల్గొన్నారు.