నీ భార్యను నాకు ఇచ్చేయ్.. పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటా.. భర్తను కోరిన వ్యక్తి.. చివరికి?
ప్రేమ అనే పదానికి అర్థం లేకుండా పోతుంది. వివాహితలతో అక్రమ సంబంధాల వ్యవహారాలు రోజు రోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక్కడ ఓ వ్యక్తి వేరొకడి భార్యపై ఆశలు పెంచుకున్నాడు. ఆమెను ప్రేమిస్తున్నానని, ఆమె భర్త వెంటపడ్డాడు. "నీ భార్యను నాకు ఇచ్చేయ్.. బంగారంలా చూసుకుంటాను" అంటూ వేడుకున్నాడు. అయితే ఆ భర్త కనికరించకపోవడంతో ప్రేయసి ఇంటి ముందే నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే.. విశాఖ, ఆనందపురానికి చెందిన దంపతులు జూనియర్ ఆర్టిస్టులుగా పనిచేస్తున్నారు. సదరు మహిళకు.. సమీప గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ సూర్యనారాయణతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కారణంగా సూర్యనారాయణ సదరు మహిళ ఇంట్లోనే వుంటున్నాడు. భార్యాపిల్లలు తనను సరిగ్గా చూసుకోలేదన్నాడు. ఈ బాధ విని అన్నం పెట్టి ఇంట్లోనే వుండమన్న మహిళపై సూర్యనారాయణ ఇష్టం పెంచుకున్నాడు. ఆమె అంటే ఇష్టం పెంచుకున్నాడు. అయితే శనివారం రాత్రి సీన్ రివర్స్ అయ్యింది. బాగా మందేసిన సూర్యనారాయణ.. దంపతుల ఇంటికొచ్చి మనస్సులో వున్నదంతా దంపతుల ముందు చెప్పేశాడు.
ఏకంగా సదరు మహిళ భర్త వద్దే.. అతడి భార్యను ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఆమెను తనకిచ్చేమని అడిగాడు. పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని.. ఆమెను తనతో పంపిచేయాలని వేడుకున్నాడు. ఆమె లేకుండా తాను జీవించలేనని చెప్పాడు. అయితే సూర్యనారాయణపై మహిళ భర్త మండిపడ్డాడు.
పెళ్లాన్ని ఇవ్వమని తననే అడుగుతావా అంటూ కోపంతో ఇంటి నుంచి గెంటేశాడు. శనివారం రాత్రి ఆ ఇంటి బయటే నిద్రపోయిన సూర్యనారాయణ.. ఆదివారం తెల్లవారుజామున యూసుఫ్ గూడ పోలీస్ బెటాలియన్ పెట్రోల్ బంకు నుంచి పెట్రోల్ కొనుక్కొచ్చాడు. ప్రియురాలి ఇంట ముందు నిలిచి పెట్రోల్ పోసుకుని నిప్పెట్టుకున్నాడు.
ఈ ఘటనలో తీవ్రగాయాలైన అతనిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అక్కడ సూర్యనారాయణ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.