శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (13:51 IST)

సొంతూరుకు వెళ్ళేందుకు శవం గెటప్... సినీ ఫక్కీలో ప్రయాణం.. చివరకు..

కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో వుంది. దీంతో అన్ని రకాల రాకపోకలు బంద్ అయ్యాయి. ప్రజల కష్టాలు కూడా పెరిగిపోయాయి. అనేక ప్రాంతాల్లోని వలస కూలీలు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. తినేందుకు తిండిలేక.. ఉండేందుకు నీడ లేకు అష్టకష్టాలు పడుతున్నారు. ఇలాంటివారంతా తమతమ సొంతూళ్ళకు పయనమైపోతున్నారు. 
 
ఎలాంటి రవాణా సౌకర్యాలు లేకపోవడంతో కాలిమార్గంలో నడిచిపోతున్నారు. మరికొందరు తమ తెలివితేటలకు పని పెట్టారు. ఇలాంటి వ్యూహాలు రచించడంలో ఆరితేరిన ఓ వ్యక్తి.. ఏకంగా శవం గెటప్ వేసి పోలీసులకు చిక్కిపోయాడు. దీంతో అతనితోపాటు.. అతనికి సహకరించిన ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పూంచ్ జిల్లాలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పూంచ్ జిల్లాలో వలస కూలీలుగా పని చేస్తున్న ముగ్గురు వ్యక్తులు పథకం రచించుకున్నారు. వారిలో ఒక వ్యక్తి చనిపోయినట్లుగా మరణ ధృవీకరణ పత్రాన్ని సృష్టించుకున్నాడు. 
 
గ్రామానికి వెళ్లేందుకు ఆంబులెన్స్‌ను అద్దెకు తీసుకున్నారు. పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు ఆ ముగ్గురిలో ఓ వ్యక్తి మరణించినట్లు నటించాడు. శవాన్ని తమ గ్రామానికి తీసుకెళ్తున్నామని చెక్‌పోస్టుల వద్ద పోలీసులను నమ్మిస్తూ వచ్చాడు. అయితే సూరన్ కోట్ చెక్‌పోస్ట్‌‌కు చేరుకోగానే పోలీసులు అనుమానం వచ్చి అంబులెన్స్‌ను తనిఖీ చేశారు. అందులో శవంలా ఉన్న వ్యక్తికి టెంపరేచర్ చూడగా బతికే ఉన్నాడని పసిగట్టారు. 
 
దీంతో ఆ ముగ్గురు వ్యక్తులతో పాటు డ్రైవర్, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని వారిపై సెక్షన్ 420 (మోసం), 269 (జీవితానికి ప్రమాదకరమైన వ్యాధి సంక్రమణను వ్యాప్తి చేసే నిర్లక్ష్య చర్య) మరియు 188 (ప్రభుత్వ సేవలకు ఆటంకం) కింద కేసు నమోదు చేశారు. దీంతో ఈ ఐదుగురు ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నారు.