మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (10:52 IST)

జెడీ లక్ష్మీనారాయణతో సెల్ఫీలా? ఎంపీ భ‌ర‌త్ పై, ఎమ్మెల్యే జ‌క్కంపూడి ఫైర్!

వైసీపీకి, అధినేత‌కు ద్రోహం చేస్తే, ఉపేక్షించేది లేదని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎంపీ భ‌ర‌త్ పై మండిప‌డ్డారు. రాజమహేంద్రవరంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ,  30 సంవత్సరాలుగా రాజకీయంగా ఉన్న తమ కుటుంబానికి  బీసీ, ఎస్సీ, ఎస్టీలతో విడదీయలేని అనుబంధం ఉందని అన్నారు. కొందరు స్వార్ధపరులు తనపై కుట్ర పన్నుతున్నారని, ఎన్ని కుట్రలు చేసినా తన వెంట్రుకకు కూడా పీకలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
రాష్ట్ర ముఖ్యమంత్రి  జగన్ ను ఇబ్బంది పెట్టిన  జెడీ లక్ష్మీనారాయణతో  కలిసి  ఎం.పి భరత్  సెల్ఫీలు  తీసుకుంటారా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డిని ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తి జేడీ, మాకు బద్ధ శత్రువు అని పేర్కొన్నారు. కడియం నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కొందరు వ్యక్తులు తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం అయ్యారని ఆరోపించారు. రాజమహేంద్రవరంలో వై.సి.పి పార్టీని ఎం.పి భరత్  సర్వనాశనం చేస్తున్నారని అన్నారు. టి.డి.పి ఎమ్మెల్యే గోరంట్లతో  కలిసి ఎం.పి భరత్ కుమ్మక్కు  రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. రౌడీషీటర్లు, భూకబ్జాదార్లు  ఎం.పి భరత్ వెనుక ఉన్నారని ఆరోపించారు.
 
రాజమహేంద్రవరంలో తాము వార్డు మెంబర్ గా పోటీ చేసేందుకు కూడా ప్రయత్నం చేయడం లేదని, కానీ పార్టీ జెండా మోసిన కార్యకర్తలు, నాయకులకు మాత్రం తగిన గుర్తింపు ఇవ్వాల్సిందేనన్నారు. జనసేన నాయకుడిని తీసుకొచ్చి ఎయిర్పోర్ట్ సలహా కమిటీ సభ్యుడిగా నియమించడమేమిటని నిలదీసారు. నగరంలో పార్టీ ఓడిపోయిందని, తాను ఇప్పటికీ కుటుంబంతో కలిసి మథ‌నపడుతున్నానని, గత 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగుతూ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నామన్నారు.
 
ఎం.పి భరత్ వి  పిచ్చిపిచ్చి చేష్టలని, ఆయ‌న తీరు మార్చుకోవాలని హితవు పలికారు. రాజానగరం నియోజకవర్గంలో నా  వెంట్రుక కూడా పీకలేరని అన్నారు. నాపై  చెయ్యాల్సిన వ్యాఖ్యలు  చేసేసి చివరిగా తూచ్ తుచ్ అంటే కుదరదని అన్నారు.  
 
మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ పగటి వేషగాళ్ళ ఆరు నెలలకు ఒకసారి వచ్చి నాటకాలు వేస్తూ వచ్చి వెళుతుంటాడని విమర్శించారు. ఎమ్మెల్యేగా 10 సంవత్సరాల చేసిన రాజానగరం నియోజకవర్గం అభివృద్ధి చేసింది ఏమి లేదనీ అన్నారు. ఇసుక మాఫియా,మట్టి మాఫియా ద్వారా హైదరాబాద్ బెంగళూరులో ఆస్తులు పెంచుకుని లాభాలు గడించుకొన్నార‌ని అన్నారు. 
 
కోవిడ్ సమయంలో జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ద్వారా 15 కోట్లు రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపించార‌ని, ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేశారు. నాపై ఆరోపణలు చేసిన వ్యక్తి పై కోర్టులో పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. దీనిపై కోర్టులో వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.