గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 29 జులై 2018 (17:35 IST)

మీ మోచేతి నీళ్లు తాగుతూ.. మీ పల్లకీలు మోస్తూ ఉండాలా? ముద్రగడ పద్మనాభం

కాపులను బీసీల్లో చేర్చే అంశం రాష్ట్ర పరిధిలో లేదని.. కేంద్ర పరిధిలో ఉందని వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తీవ్రంగా ఖండించారు. ఆయన ఆదివారం

కాపులను బీసీల్లో చేర్చే అంశం రాష్ట్ర పరిధిలో లేదని.. కేంద్ర పరిధిలో ఉందని వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తీవ్రంగా ఖండించారు. ఆయన ఆదివారం కాకినాడలో విలేకరులతో మాట్లాడుతూ, తుని సంఘటన సమయంలో తమకు మద్దతిచ్చిన జగన్‌ ఇప్పుడు ఇలా మాట్లాడటం తగదన్నారు. కులాల వారీగా మీకు దాసోహంగా ఉండాలా? అని ప్రశ్నించారు.
 
'కాపులు ఎప్పుడూ మీ మోచేతి నీళ్లు తాగుతూ.. మీ పల్లకీలు మోస్తూ ఉండాలా? మా రిజర్వేషన్లు రాష్ట్రానికి సంబంధం లేని విషయమని, కేంద్రానికి సంబంధించిన అంశమని అంటున్నారే.. కేంద్రం పరిధిలో ఉన్న అనేక విషయాలపై మీరు ఉద్యమాలెందుకు చేస్తున్నారు? మా జాతిపై మీకు అంత చిన్న చూపు ఎందుకు? మా జాతి ఏం చేసింది? ఆరు నెలలుగా పాదయాత్రలో ఇస్తున్న హామీలకు రాష్ట్ర, కేంద్ర బడ్జెట్‌లు రెండూ కలిపినా సరిపోతాయా? పదవీకాంక్షతో మీరు ఇలాంటి హామీలు ఎన్నైనా ఇవ్వొచ్చు కానీ, మా జాతికి రిజర్వేషన్లు ఇవ్వలేరా?' అని జగన్‌ను ముద్రగడ నిలదీశారు. 
 
'జగన్ అపర మేధావి. కాపు జాతి ఏమీ చేయలేదనే మిగిన జాతుల ఓట్ల కోసం ఆయన ఈ స్టెప్ తీసుకున్నాడు. ఈ జిల్లా నుంచే పవన్‌ని వ్యక్తిగతంగా అవమానించాడు. రిజర్వేషన్లు సాధ్యం కాదంటూ కాపుజాతి ఆశలపై నీళ్ళు చల్లాడు' అంటూ వ్యాఖ్యానించారు. అలాగే, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై జగన్ చేసిన వ్యక్తిగత విమర్శలు చాలా తప్పని అన్నారు. రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను లాగడం దారుణమని ముద్రగడ చెప్పుకొచ్చారు.