సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (08:51 IST)

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలి: వర్ల రామయ్య

ఎంపిటీసి, జెడ్.పి.టి.సి ఎన్నికలకు మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ జారీచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

2020 మార్చి లో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఎంపిటీసిలలో 24 శాతం, జెడ్.పి.టి.సి లలో 19 శాతం బలవంతపు ఏకగ్రీవాలు చేసుకుని వైసీపీ ఎన్నికల అక్రమాలకు పాల్పడిందని లేఖలో పేర్కొన్నారు.

ఇదే విషయాన్ని గత ఎన్నికల కమీషనర్ కేంద్ర హోం సెక్రటరీకి సైతం లేఖ రాశారని తెలిపారు. కొంత మంది పోలీసులతో అధికార పార్టీ కుమ్మక్కై బలవంతపు ఏకగ్రీవాలు చేసుకున్నారు. పోలీసులే పోటీదారుల చేత బలవంతంగా నామినేషన్లను ఉపసంహరింపజేశారు.

వైసీపీ బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడింది. నిజమైన ప్రజాస్వామ్యమంటే ఎన్నికల్లో పోటీచేసే ప్రతీ పోటీదారుడికి, అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలి. కానీ, గత మార్చిలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో వైసీపీ దౌర్జన్యాలతో ప్రజాస్వామ్యం అపహాస్యం చేయబడింది.

ప్రజాస్వామ్యంపై ప్రజల నమ్మకాన్ని కాపాడాలంటే ఎం.పీ.టి.సీ జెడ్.పి.టీ.సీ లకు కొత్త నోటిఫికేషన్ జారీచేచేసి, స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని వర్లరామయ్య ఎన్నికల సంఘాన్ని కోరారు.