శనివారం, 18 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 అక్టోబరు 2025 (09:03 IST)

ఈశాన్య రుతుపవనాల జోరు - ఏపీకి భారీ వర్ష సూచన

Rains
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనికి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ముఖ్యంగా, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది. 
 
అలాగే, శ్రీసత్యసాయి, అనంతపురం, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక చేసింది. శుక్రవార అంటే అక్టోబరు 17వ తేదీన ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. అలాగే, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ  పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 
 
దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35-55 కిలోమీటర్ల వేంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో జాలర్లు చేపలవేటకు సముద్రంలోకి వెళ్లరాదని సూచించింది. అలాగే, ప్రజుల అప్రమత్తంగా ఉండాలని, చెట్లు, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్స్ వంటి వాటివద్ద నిలబడరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.