ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 16 నవంబరు 2020 (21:15 IST)

ఆపద రోజే రూ. 10 వేల తక్షణ సాయం, వైఎస్సార్‌ బీమా పథకం విధివిధానాలు వెల్లడి

అమరావతి: ఇంటిని పోషించే పెద్ద చనిపోవడం వంటి కారణాలతో ఆ కుటుంబం ఆనాధగా మారకూడదన్న ఉద్దేశంతో వైఎస్సార్‌ బీమా పథకానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆపద సమయంలో అదే రోజు లబ్ధిదారుని కుటుంబానికి రూ.10 వేలు తక్షణ సాయం అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వైఎస్సార్‌ బీమా పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలతో పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు.
 
అర్హత ఉన్న వారు ఈ పథకంలో ఎప్పుడైనా తమ పేర్లను సచివాలయాల్లో నమోదు చేసుకోవచ్చని ఉత్తర్వులో పేర్కొన్నారు. లబ్ధిదారుని పరిధికి సంబంధించిన వలంటీర్‌ ఆ కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి ఈ పథకం కోసం రూపొందించిన మొబైల్‌ యాప్‌లో వివరాలు నమోదు చేసుకుంటారు. పరిశీలన పూర్తికాగానే సచివాలయాల్లో పనిచేసే డిజిటల్‌ అసిస్టెంట్, సంబంధిత వలంటీర్‌.. ఇద్దరు కలిసి వెళ్లి ఆ కుటుంబానికి తక్షణ ఖర్చుల నిమిత్తం నామినీకి రూ.10 వేలు చెల్లిస్తారు.
 
ప్రతి సచివాలయంలో రూ.20 వేలు డిపాజిట్‌ 
వలంటీర్‌ అందుబాటులో లేని ప్రాంతాల్లో  వైఎస్సార్‌ బీమా కాల్‌ సెంటర్‌ ద్వారా సచివాలయాల్లో పనిచేసే డిజిటల్‌ అసిస్టెంట్లకు సమాచారం తెలియజేసి ఈ సేవలు అందజేస్తారు. ఇందుకు వీలుగా ప్రతి గ్రామ సచివాలయంలో ప్రత్యేకంగా ఈ పథకం కోసం రూ.20 వేల చొప్పున డిపాజిట్‌ చేస్తారు.  సాధారణ మరణం అయితే ఆ కుటుంబానికి 15 రోజుల వ్యవధిలో, ప్రమాదవశాత్తు మరణం అయితే 21 రోజుల వ్యవధిలో లబ్ధిదారుని నామినీకి ఇన్సూరెన్స్‌ కంపెనీ ద్వారా మిగతా డబ్బులు అందజేసే ప్రక్రియకు సంబంధించి వలంటీర్‌ తోడ్పాటు అందిస్తారు.
 
 ప్రమాదం జరిగి లబ్ధిదారుడు తీవ్రంగా గాయపడిన పరిస్థితులలో ఇన్సూరెన్స్‌ కంపెనీ ద్వారా లబ్ధిదారునికి అందాల్సిన సాయం 55 రోజుల్లో క్లెయిమ్‌ రూపంలో అందించడానికి వలంటీర్, సచివాలయ సిబ్బంది తోడ్పడతారు. జిల్లా కేంద్రాల్లో ఉండే వైఎస్సార్‌ బీమా కాల్‌ సెంటర్లు ఆ జిల్లా పరిధిలో క్లెయిమ్‌ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పర్యవేక్షిస్తాయి.
 
నిరంతర పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో పంచాయతీ రాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా, సెర్ప్‌ సీఈవో కన్వీనర్‌గా, పది శాఖల ఉన్నతాధికారులు, ఇన్సూరెన్స్‌ కంపెనీ ప్రతినిధులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ప్రతినెలా ఈ కమిటీ సమావేశమై క్లెయిమ్‌ల పరిస్థితిని సమీక్షిస్తుంది.  జిల్లా స్థాయిలోనూ ఏర్పాటు చేసిన కమిటీలు ప్రతి నెల 5వ తేదీలోపే ఆ జిల్లాకు సంబంధించిన క్లెయిమ్‌ల పరిస్థితిని సమీక్షించాల్సి ఉంటుంది.