కోడికూర వడ్డిస్తే సరిపోదు.. నీవు కూడా కావాలి... : కురిచేడు తాహసీల్దారు వక్రబుద్ధి
ప్రకాశం జిల్లాలోని కురిచేడు తాహసీల్దారు తనలోని వక్రబుద్ధిని బయటపెట్టాడు. తనకు కోడికూర వడ్డించిన ఓ మహిళా వీఆర్ఏ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. కోడికూర వడ్డిస్తే సరిపోదనీ నీవు కూడా కావాలంటూ తనలోని లైంగికవాంఛను వెల్లడించారు. ఆ వేధింపులు భరించలేని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న దర్శి డీఎస్పీ ప్రకాశరావు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కురిచేడు తాహసీల్దారుగా డీవీబీ వరకుమార్ పని చేస్తున్నాడు. ఈయన మండల పరిధిలోని పడమర వీరాయపాలెం గ్రామానికి చెందిన వీఆర్ఏగా పని చేస్తున్న ఓ మహిళను వేధించసాగాడు. ఈ వేధింపులు భరించలేని ఆ మహిళా వీఆర్ఏ పోలీసులను ఆశ్రయించింది.
ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించిన వివరాల మేరకు, గత నెల 25న క్రిస్మస్ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలోని సహోద్యోగులను విందు నిమిత్తం వీఆర్ఏ తన ఇంటికి ఆహ్వానించింది. సిబ్బంది అందరూ వెళ్లగా, వరకుమార్ మాత్రం వెళ్లలేదు.
గత శనివారం నాడు, తాను విందుకు రాలేదని గుర్తు చేసిన ఆయన, ఒంటరిగా విందు ఇవ్వాలని కోరారు. విందులో కోడికూరతో పాటు నువ్వూ కావాలని చెప్పాడట. తండ్రి వంటి వారు ఇలా అనడం సరికాదని ఆమె చెబుతున్నా వినకుండా, వెనక నుంచి వచ్చి కౌగిలించుకుని అసభ్యకరంగా మాట్లాడారని ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
కాగా, తనపై వీఆర్ఏ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని వరకుమార్ వివరణ ఇచ్చారు. తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, ఉన్నతాధికారులు విచారణ జరిపి నిజాలను తేల్చాలని డిమాండ్ చేయడం గమనార్హం