ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 జులై 2021 (10:22 IST)

జులై 15 నుంచి ఆన్‌లైన్ క్లాసులు

ఏపీలో తరగతుల ప్రారంభ తేదీపై క్లారిటీ వచ్చింది. జూలై 15 నుంచి ఆన్ లైన్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు తెలిపారు. దూరదర్శన్‌, రేడియో, విద్యా వారధి ద్వారా ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తామని చెప్పారు. కాగా, స్కూళ్లకు విద్యార్థులు ఎప్పటి నుంచి రావాలనే దానిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.
 
సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ వెట్రిసెల్వితో కలిసి ఆదివారం కృష్ణా జిల్లా పెడనలో చినవీరభద్రుడు పర్యటించారు. స్థానిక రెండో వార్డులో 'నాడు-నేడు' కింద అభివృద్ధి చేసిన స్కూల్ ని పరిశీలించారు. ఈ నెల ఒకటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు 50 శాతం హాజరవుతూ బడుల పునఃప్రారంభానికి సిద్ధం చేస్తున్నారని, విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియ జరుగుతోందని కమిషనర్ చెప్పారు.
 
కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఆన్ లైన్ క్లాసుల వైపు మొగ్గుచూపింది. విద్యార్థులు స్కూళ్లకు వచ్చే పరిస్థితులు లేవు. ఇంకా మహమ్మారి ముప్పు పొంచి ఉంది. ఈ పరిస్థితుల్లో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. విద్యా సంవత్సరం వృథా కాకుండా ఆన్ లైన్ క్లాసులు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

కరోనా కారణంగా పలు పరీక్షలు రద్దయ్యాయి. ఎగ్జామ్స్ లేకుంనే విద్యార్థులను పాస్ చేశారు. రానున్న రోజుల్లో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందనే వార్తలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆన్ లైన్ క్లాసుల వైపు ప్రభుత్వం మొగ్గుచూపింది.