శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 30 సెప్టెంబరు 2020 (09:41 IST)

శాంతించిన కృష్ణమ్మ

రెండు రోజులుగా మహోగ్రంగా ఉన్న కృష్ణమ్మ శాంతించింది. బ్యారేజి దిగువకు నీటి విడుదల తగ్గిస్తూ వస్తున్నారు. దీంతో పలు గ్రామాలు, పంటలు వరద ప్రవాహం నుంచి తేరుకుంటున్నాయి.

వరద నీరు వెనక్కి వెళ్లడంతో నష్ట పోయిన పంటలు తేలుతున్నాయి. మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల్లో వరద కూడా వెనక్కు తగ్గింది.

కొన్ని గ్రామాలకు వెళ్లే రోడ్లు బయటపడితే, కొన్ని అంతర్గత రహదారులు వరద నీటిలోనే ఉన్నాయి. బయటపడిన రోడ్లు గండ్లుపడి ప్రమాదకరంగా మారాయి. కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లో నష్టం ఎక్కువగా ఉండటంతో అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

ప్రకాశం బ్యారేజి వద్ద క్రమంగా వరద ఉధృతి తగ్గుతోంది. పులిచింతల, బ్యారేజి ఎగువన ఉన్న వాగుల నుంచి మంగళవారం సాయంత్రానికి 4,19,000 క్యూసెక్కుల నీరు బ్యారేజికి వచ్చి చేరుతోంది. దిగువకు 4,12,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

తూర్పు, పశ్చిమ డెల్టా కాల్వలకు 7,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజి వద్ద 12.5 అడుగుల నీటి మట్టం కొనసాగిస్తూ 70 గేట్లను పూర్తిగా ఎత్తి దిగువకు వదులుతున్నట్లు జేఈ దినేష్‌ తెలిపారు. 

ఉధృతి తగ్గడంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. మరికొన్ని రోజులు దిగువకు వరద ప్రవాహం కొనసాగవచ్చని, ఈ దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.