సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , బుధవారం, 22 సెప్టెంబరు 2021 (11:15 IST)

కడియంలో మావాళ్లకు అన్యాయం జరిగితే నేనే వచ్చి తేల్చుకుంటా

కడియం మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను సజావుగా సాగేలా చూడాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కోరారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండల జెడ్పీటీసీ స్థానంతోపాటు అత్యధిక ఎంపీటీసీ స్థానాలను జనసేన పార్టీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో 24వ తేదీన జరిగే మండలాధ్యక్ష పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని అధికార పార్టీ నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు.

జనసేన పార్టీ సభ్యుల మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చి, వారిని వారి కుటుంబ సభ్యుల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ తరఫున విజయం సాధించిన కడియం మండల ఎంపీటీసీలు హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ని కలిశారు. 
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ "పరిషత్ ఎన్నికల్లో రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో జనసేన పార్టీ తీవ్రమైన ప్రతికూలతల మధ్య బరిలోకి దిగింది. అధికార వైసీపీ దాష్టీకాలు, పోలీసుల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొని 180 ఎంపీటీసీ స్థానాలు కైవసం చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా, కడియంతో కలిపి రెండు జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకుంది. అయితే 24వ తేదీ జరగబోయే మండలాధ్యక్ష ప్రక్రియ ఉన్న నేపధ్యంలో జనసేన పార్టీ తరఫున గెలిచిన ఎంపీటీసీలు మీద వైసీపీ నాయకులు విపరీతమై ఒత్తిడి తీసుకువస్తున్నారు.

పోలీసుల యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ఒత్తిళ్లు, బెదిరింపులకు పాల్పడుతున్న విషయాన్ని మా పార్టీ నేతలు నా దృష్టికి తీసుకువచ్చారు. వైసీపీ ఇన్ని స్థానాలు గెలుచుకుని  కూడా జనసేన గెలుచుకున్న స్థానాల కూడా లాక్కోవాలనే ఉద్దేశ్యంతో మొండిపట్టుకుపోయి మా వారి మీద రకరకాల ఒత్తిళ్లు తెస్తూ, ప్రలోభాలు పెడుతున్నారు. 
 
పోలీసు అధికారులను కూడా వాడుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కడియం మండలం పొట్టిలంకలో 1224 ఓట్ల మెజారిటీతో జనసేన అభ్యర్ధి గెలుపొందితే, కనీసం గెలిచిన అభ్యర్ధికి దండ వేసే పరిస్థితి లేకుండా నిర్ధాక్షణ్యంగా  కామిరెడ్డి సతీష్ అనే జన సైనికుడిని దారుణంగా కొట్టారు. కాళ్లు పట్టుకుని ప్రాధేయపడినప్పటికీ పోలీసులు కనికరం చూపలేదన్న విషయాన్ని పార్టీ నాయకులు నా దృష్టికి తీసుకువచ్చారు. ఇది చాలా బాధ కలిగించింది. కడియం మండలం వీరవరం ఎంపీటీసీ స్థానాన్ని జనసేన గెలిచిందన్న అక్కసుతో కర్రలకు మేకులు కొట్టి చాలా అడ్డోగోలుగా, అన్యాయంగా కొత్తపల్లి అయ్యప్ప అనే కార్యకర్తపై అమానుషంగా దాడి చేశారు. పోలీసుల దృష్టికి తీసుకువెళ్లి కేసు పెట్టాలని కోరితే వారి నుంచి స్పందన కరువయ్యింది. చివరికి మా పార్టీ నాయకులు స్టేషన్ బయట బైఠాయిస్తామని హెచ్చరిస్తే తప్ప కేసు ఫైల్ చేయలేదు.
ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో మా నాయకులకు, కార్యకర్తలకు, వీరమహిళలకు, ఆడపడుచులకు పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇస్తున్నాం. 24వ తేదీన జరిగే మండలాధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో మావాళ్లను ఇబ్బంది పెట్టినా, ఓటింగ్ కి రానివ్వకున్నా, స్వయంగా నేనే కడియపులంకకు వస్తాను.

మా వాళ్లకు ఎలాంటి అన్యాయం జరిగినా స్వయంగా నేనే వచ్చి తేల్చుకుంటా. అలాంటి పరిస్థితులు కావాలి అని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటే నేనూ దానికి సిద్ధంగానే ఉన్నా. ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ గారి దృష్టికి, రాష్ట్ర ఎన్నికల అధికారిణి శ్రీమతి నీలం సాహ్నీ గారి దృష్టికి, చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి ఒక విషయాన్ని తీసుకువస్తున్నాను. ఎన్నిక సజావుగా జరగకపోతే ఉత్పన్నమయ్యే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలి. కడియం మండలాన్ని మేము కైవసం చేసుకోబోతున్నాం. దాన్ని అడ్డుకునే హక్కు అయితే మీకు లేదు

. ఇలాంటివి చేస్తానంటే ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగానే ఉన్నాం. ముందు ముందు కూడా మీ దౌర్జన్యాలను ఇలానే కొనసాగిస్తే విషయాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకువెళ్తాం. ముఖ్యంగా పోలీసు ఉన్నాతాధికారులు, జిల్లా అధికారులకు ప్రత్యేకించి ఒక విషయం చెబుతున్నాను. మా వాళ్ల మీద అమానుషంగా దాడులు జరగుతున్నాయి. మీరు ఒత్తిడులకు తలొగ్గి మా వాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. ఈ పద్దతిని సరిచేసుకోండి" అని కోరారు.