సోషల్ మీడియా పోస్టులపై అంతెత్తున లేచిన రేణుకా చౌదరి
తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి రేణుకాచౌదరి ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ఈ వివాదాస్పద పోస్టులను పెడుతున్నది కాంగ్రెస్, టీడీపీ నేతలేనని ఆరోపణలు గుప్పించారు. పోస్టింగులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఖమ్మం ఎన్నికల రిటర్నింగ్ అధికారితోపాటూ ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు ఎవరు పెట్టినా సైబర్ పోలీసులు ఇట్టే కనిపెట్టగలరని.. రేణుకా చౌదరి చెప్పారు. ఎవరు ఏ పోస్టు పెట్టినా... ఏదో ఒక ఇంటర్నెట్ కనెక్షన్ వాడక తప్పనిసరి. ప్రతీ ఇంటర్నెట్ కనెక్షన్‌కీ ఓ కోడ్ ఉంటుంది. అదే ఇంటర్నెట్ ప్రోటోకాల్. దీన్నే మనం ఐపీ అడ్రెస్ అంటున్నాం. ఐపీ అడ్రెస్ ఆధారంగా ఆ పోస్టులు మొబైల్ ఇంటర్నెట్ ద్వారా వచ్చాయా లేక, కంప్యూటర్ లేదా ఇంటర్నెట్ కేఫ్ నుంచీ పోస్ట్ చేశారా అన్నది తెలిసిపోతుంది. తద్వారా వాళ్లను పట్టుకొని జైలుకు పంపడం తేలికేనని రేణుకా చౌదరి చెప్పుకొచ్చారు.