శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2019 (20:48 IST)

బిట్రగుంట లో రైల్వే పరిశ్రమలు పెట్టండి... నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి

నెల్లూరు జిల్లాకు రైల్వే పరంగా ఆయువుపట్టుగా ఉండి, అన్ని సౌకర్యాలు కలిగి ఉన్న బిట్రగుంట లో రైల్వే పరిశ్రమను ఏర్పాటు చేయాలని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కోరారు.

బుధవారం మధ్యాహ్నం  ఢిల్లీలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు విజయ్ సాయిరెడ్డితో కలిసి కేంద్ర రైల్వే  మంత్రి పీయూశ్  గొయల్ కు ఆయన కార్యాలయంలో ఒక వినతిపత్రాన్ని అందజేశారు. బిట్రగుంట లో 11 వందల ఎకరాలకు మించి రైల్వే స్థలం, ఎన్నో మౌలిక సౌకర్యాలు ఇప్పటికే ఉన్నాయని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు.

అందువల్ల అక్కడ  కాంక్రీట్ స్లీపర్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నీ కానీ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ మెయింటెనెన్స్ సెంటర్ను కానీ లేదా క్యారేజ్ అండ్ వ్యాగన్ వర్క్షాప్ను కానీ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో సైతం దీని గురించి ప్రస్తావించానని గుర్తు చేశారు.

అలాగే ఈనెల 25వ తేదీన గూడూరు నుంచి విజయవాడ కు కొత్తగా ప్రవేశపెడుతున్న ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ను  బిట్రగుంటలొ నిలుపుదల చేయాలని కోరారు. తద్వారా బిట్రగుంటకు న్యాయం జరుగుతుందని, జిల్లావాసులకు ఎన్నో ఉద్యోగాలు లభించడంతోపాటు స్థానిక యువతకు న్యాయం జరుగుతుందని తెలిపారు. రైల్వే పరిశ్రమ ఏర్పాటుతో జిల్లా అభివృద్ధికి కూడా అవకాశం లభిస్తుందని తెలిపారు.

ఆయన సమర్పించిన వినతిపత్రంపై రైల్వేమంత్రి  పీయూష గొయల్  సానుకూలంగా స్పందించారు.  తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇదే విషయమై రైల్వే బోర్డు చైర్మన్ను కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి కలిసి ఒక వినతిపత్రాన్ని సమర్పించి తగిన న్యాయం చేయాలని కోరారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు.