శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (10:42 IST)

విశాఖలో జోరందుకున్న ప్లాట్ల విక్రయం

విశాఖలో పరిపాలనా రాజధాని ప్రకటనతో రియల్‌ జోరంజుకుంది. ఇప్పటి వరకు నగర శివారు ప్రాంతాలైన మధురవాడ, కొమ్మాది, ఆనందపురం, కూర్మన్నపాలెం, దువ్వాడ, లంకెలపాలెం ప్రాంతాల్లో వేసిన అపార్టుమెంట్లలో అమ్మకాలు నెమ్మదిగానే జరుగుతూ వస్తున్నాయి.

చాలామంది వెంచర్లు వేసినప్పటికీ అమ్ముడవక ఆర్ధిక ఇబ్బందులతో మధ్యలోనే నిలిపివేసిన నిర్మాణాలు అనేకం ఉండేవి. అయితే రాజధాని ప్రకటన నేపథ్యంలో అమ్మకాలు ఒక్కసారి పుంజుకోవడంతో అప్పు చేసైనా నిర్మాణాలు పూర్తి చేయడానికి వ్యాపారులు సిద్ధమవుతున్నారు. అలాగే శివారు ప్రాంతాల్లో సైతం ప్లాట్ల ధరలు అమాంతం పెంచేస్తున్నారు.

మధురవాడ, కొమ్మాది ప్రాంతాల్లో సైతం అపార్ట్‌ మెంట్లలో చదరపు అడుగు రూ.3వేలకు తక్కువకు దొరకడం లేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇక ఎండాడ ప్రాంతంలో చదరపు అడుగు రూ.5వేలకు, పిఎంపాలెంలో రూ.3500లకు విక్రయిస్తున్నారు. ఊపు మీద ఉన్నప్పుడే అమ్మకాలు చేసుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు.
 
సాధారణంగా విశాఖలో భూముల ధరలు ఇప్పటికే అధికంగా ఉన్నాయి. నగర పరిధిలో సామాన్య మధ్యతరగతి ప్రజలు గజం స్థలం కూడా కొనుగోలు చేయలేని స్థాయిలో ధరలు ఆకాశాన్నంటాయి. ఇక మధురవాడ, కొమ్మాది, ఆనందపురం, పెందుర్తి, కూర్మన్నపాలెం, దువ్వాడ ప్రాంతాల్లో గజం స్థలం రూ.25వేలు నుంచి రూ.50 వేలు వరకు పలుకుతోంది.

రాజధాని ప్రకటనతో ఈ ధరలు ఇంకా పెరిగిపోయాయి. అసలు కొనుగోలు చేద్దామన్న ఎవరు అమ్మడానికి ఆసక్తి చూపించడం లేదు. స్థలాలను అమ్మేకంటే వాటిని డెవలప్‌మెంట్‌ ఇస్తేనే ఇంకా ఎక్కువ లాభం వస్తుందని చాలా మంది భూ యజమానులు భావిస్తున్నారు. దీంతో భూములు అమ్మేవారు కనిపించడం లేదు.

అలాగే ఆనందపురం దాటి విజయనగరం జిల్లా వరకు భూముల ధరలు రెట్టింపయ్యాయి. బోయపాలెం, భీమిలి, తగరపువలస ప్రాంతాల్లో గజం రూ.25వేలు చెబుతున్నారు. విజయనగరం జిల్లా బోగాపురం ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం రానుండడంతో అక్కడ ధరలు విపరీతంగా పెరిగాయి.

ఆయా ప్రాంతాల్లో వేసిన వెంచర్ల అమ్మకాలను కూడా వ్యాపారులు నిలిపివేశారు. మరికొద్ది రోజులు ఆగితే రెట్టింపు ధరలకు భూములు అమ్మొచ్చని ఆలోచన చేస్తున్నారు.