చంద్రబాబు భద్రత కుదింపు పునరుద్ధరణపై నేడు విచారణ
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హైకోర్టును ఆశ్రయించారు. వైయస్ జగన్ ప్రభుత్వం తనకు భద్రత కుదించిందని కుదించిన భద్రతను పునరుద్ధరించేలా చూడాలంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చంద్రబాబు పిటీషన్ స్వీకరించిన ఏపీ హైకోర్టు మంగళవారం ఉదయం విచారించనుంది.
ఇకపోతే చంద్రబాబు నాయుడుకు భద్రత కుదించలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డీజీపీ గౌతం సవాంగ్ స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడుకు నిబంధనలకు మించి సెక్యూరిటీ ఇస్తున్నట్లు తెలిపారు. తాము నిబంధనల ప్రకారం ఆయనకు భద్రత కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. చంద్రబాబుకు భద్రత కుదించారన్న ప్రచారం అసత్యమంటూ ప్రభుత్వం కూడా వాదిస్తోంది.
ఎక్కువే ఇస్తున్నాం : గౌతం సవాంగ్
ఆంధ్రప్రదేశ్ మాజీముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు భద్రత కుదించారంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ లేదన్నారు. చంద్రబాబుకు భద్రత తగ్గించలేదన్నారు. నిబంధనల ప్రకారం ఎంత సెక్యూరిటీ ఇవ్వాలో అంతకంటే ఎక్కువగానే ఇచ్చామని డీజీపీ స్పష్టం చేశారు.
అమరావతిలో స్పందన కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ గౌతం సవాంగ్ స్పందన కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. స్పందన కార్యక‍్రమం పేరుతో ప్రతి ఎస్పీ, సీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రాబోయే రోజుల్లో స్పందన కార్యక్రమాన్ని మరింతగా ప్రజలకు చేరువ చేస్తామని స్పష్టం చేశారు.
శాంతి భద్రతల విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. మరోవైపు ప్రత్యేక హోదా ఉద్యమ కేసుల ఎత్తివేతకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
ఇకపోతే రాజకీయ దాడులపై కాగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారని తెలిపారు. అయితే వ్యక్తిగత వివాదాలను కూడా కొంతమంది రాజకీయ ముద్రవేస్తున్నారని వాస్తవాలను పరిశీలించి కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతం సవాంగ్ స్పష్టం చేశారు.