కేసీఆర్ మంత్రివర్గం : హరీష్ రావుకు కీలక శాఖ... కేటీఆర్‌కు అదే శాఖ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఇందులో కొత్తగా ఆరుగురికి చోటుదక్కింది. వారిలో తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో పాటు ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
కొత్త మంత్రులతో తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. తొలుత హరీశ్ రావుతో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం అనంతరం మంత్రి హరీశ్ రావు సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేటీఆర్‌తో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు.
ఆ పిమ్మట సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్‌లతో వరుసగా ఆమె మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్ భవన్‌లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు.
కాగా, కొత్తగా మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి కేటాయించిన శాఖల వివరాలను పరిశీలిస్తే,
హరీశ్‌రావు : ఆర్థిక శాఖ
కేటీఆర్ : పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖలు
సబితా ఇంద్రారెడ్డి : విద్యాశాఖ
గంగుల కమాలాకర్ : పౌరసరఫరాలు, బీసీ సంక్షేమం
సత్యవతి రాథోడ్ : గిరిజన, మహిళా, శిశు సంక్షేమం
పువ్వాడ అజయ్ కుమార్ : రవాణా శాఖ