శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 28 డిశెంబరు 2019 (10:08 IST)

జులాయ్‌గా తిరుగుతున్న కొడుకుని చంపేసిన తల్లి

నవమాసాలు మోసి కని, పెంచిన బిడ్డను ఓ తల్లి చంపేసింది. దీనికి కారణం జులాయ్‌గా తిరగడమే. పనీపాటలేకుండా తిరుగుతుండటంతో విసిగిపోయిన ఆమె... అతి దారుణంగా చంపేసింది. అనంతరం మతిస్థిమితం లేక చనిపోయినట్టు నమ్మించే ప్రయత్నంలో పోలీసులకు దొరికిపోయింది. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మండలంలోని పల్లెతండాకు చెందిన ఇస్లావత్ హరిలాల్ (20) అనే యువకుడు పనీపాట లేకుండా జులాయిగా తిరిగుతూవుండేవాడు. దీంతో తల్లి పలుమార్లు కొడుకుని హెచ్చరించింది. పైగా, ఏదైనా పని చేసుకుంటూ జీవించాలంటూ నాలుగు హిత వచనాలు చెప్పింది. 
 
అయినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పురాలేదు. దీంతో ఆ తల్లి విసిగిపోయింది. ఇక అతడితో లాభం లేదనుకున్న ఆమె ఈ నెల 22న ఇంట్లోనే అతడి మెడకు చున్నీ బిగించి హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని తీసుకెళ్లి సమీపంలో ముళ్ళ పొదల్లో పడేసింది. 
 
ఆ తర్వాత హత్య విషయం బయటపడకుండా తండా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసింది. హరిలాల్‌కు మతిస్థిమితం లేదని, భోజనం కూడా సరిగా చేసేవాడు కాదని పేర్కొంది. ఈ కారణంగా బయటకు వెళ్లిన అతడు చనిపోయి ఉంటాడని పేర్కొంది. 
 
ఈ విషయం స్థానిక పోలీసులకు తెలియడంతో వారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం చేయించగా, హత్యగా తేలింది. దీంతో ఆమె తల్లిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని జుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.