అమ్మాయిలకు అదే ముఖ్యం.. పెళ్లి వాళ్లు చూసుకుంటారు: ఆమ్రపాలి
వరంగల్ రూరల్, అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి.. మహిళలకు ఏది ముఖ్యమో ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. పెళ్లి చేసుకుంటే సరిపోతుంది. తన భర్తే అంతా చూసుకుంటారనే ఆలోచన ధోరణి మహిళల్లో వుండకూడదని ఆమ్రపా
వరంగల్ రూరల్, అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి.. మహిళలకు ఏది ముఖ్యమో ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. పెళ్లి చేసుకుంటే సరిపోతుంది. తన భర్తే అంతా చూసుకుంటారనే ఆలోచన ధోరణి మహిళల్లో వుండకూడదని ఆమ్రపాలి అన్నారు. ''నా కాళ్ళ మీద నేను నిలబడతా'' అనే ధోరణితో ముందుకెళ్లాలని.. ఆమ్రపాలి మహిళలకు సూచించారు. మహిళలకు పెళ్లి కాదు.. కెరీరే ఎంతో ముఖ్యమని తెలిపారు.
ఉద్యోగం చేస్తున్న మహిళలు ఓకే కానీ.. ఉద్యోగం లేని మహిళలు కుట్లు, అల్లికలు వంటి పనులు నేర్చుకుని తమ చేతుల్లో సంపాదన వుండేలా చూసుకోవాలని తెలిపారు. తన వద్దకు వచ్చే చాలామంది భర్త సరిగ్గా చూసుకోవట్లేదని ఫిర్యాదు చేస్తున్నారని.. అలాంటి ఫిర్యాదులు రాకుండా వుండాలంటే.. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కెరీర్ పరంగా రాణించే దిశగా మహిళలు దృష్టి పెట్టాలని ఆమ్రపాలి సూచించారు.
జీవితంలో పెళ్లి ముఖ్యమే. తల్లిదండ్రులు, బంధువులు.. అంతా కలిసి పెళ్లి విషయం చూసుకుంటారు. కాబట్టి పెళ్లి విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టడం కంటే ఆర్థిక స్వాతంత్రత సాధించే దిశగా అమ్మాయిలు పదో తరగతి నుంచి ఆలోచించడం మేలని ఆమ్రపాలి చెప్పుకొచ్చారు.
కాగా వరంగల్ జిల్లా అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి కాటా వివాహం జమ్ము కాశ్మీర్‌లోని ఆర్కే రెసిడెన్సీలో గత ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆమ్రపాలి ఐపీఎస్ అధికారి సమీర్ శర్మను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.