సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (20:17 IST)

అనూహ్యంగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం, ఎంతో తెలుసా?

కరోనాతో ఒక్కసారిగా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గిన విషయం తెలిసిందే. అంతరాష్ట్ర సర్వీసులను ఆపేయడం.. రాకపోకలు లేకపోవడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య లాక్‌డౌన్ సమయంలో బాగా తగ్గిపోయింది. అయితే ఆ తరువాత లాక్‌డౌన్ నిబంధనలను సడలించిన నేపథ్యంలో కాస్త ఊరట కలిగింది.
 
తిరుమల లాంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో అయితే భక్తుల రద్దీ ప్రస్తుతం అనూహ్యంగా పెరుగుతోంది. గతంలో టిక్కెట్లను బుక్ చేసుకుని కరోనా భయంతో తిరుమలకు రావాలా వద్దా అన్న ఆలోచనలో ఉన్నారు భక్తులు. 
 
కానీ ప్రస్తుతం మాత్రం టోకెన్లను బుక్ చేసుకున్న భక్తులందరూ తిరుమలకు వచ్చేస్తున్నారు. ఆ స్వామివారిని తనివితీరా దర్సించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారి హుండీ ఆదాయం కూడా అనూహ్యంగా పెరిగింది.
 
లాక్ డౌన్ సమయంలో హుండీ ఆదాయాన్ని చెప్పని టిటిడి ప్రస్తుతం పెరిగిన హుండీ ఆదాయం గురించి మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేస్తోంది. నిన్న ఒక్కరోజే స్వామివారి హుండీ ఆదాయం కోటి రూపాయలు వచ్చినట్లు టిటిడి అధికారికంగా ప్రకటించింది.
 
లాక్ డౌన్ తరువాత ఈ తరహాలో హుండీ ఆదాయం ఇదే ప్రథమం. భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో ఇక హుండీ ఆదాయం కూడా క్రమేపీ పెరుగుతుందంటున్నారు టిటిడి ఉన్నతాధికారులు. తిరుమలలో భక్తుల తాకిడి కూడా క్రమేపీ కనిపిస్తుండడం.. గోవిందనామస్మరణలు వినిపిస్తుండటం తిరుమలలో సాధారణ స్థితికి చేరుకుంటోందన్న అభిప్రాయం టిటిడి అధికారుల నుంచి వినిపిస్తోంది.