శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 18 జూన్ 2024 (10:26 IST)

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కు వై ప్లస్ సెక్యూరిటీ.. బుల్లెట్ ప్రూఫ్ కారు!!

Dy CM Pawan Kalyan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ప్రభుత్వం భద్రతను పెంచింది. ఆయనకు వై ప్లస్ సెక్యూరిటీతో పాటు బుల్లెట్ ఫ్రూఫ్ కారును కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ముగిసిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించడంతో ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో సీఎంగా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా చంద్రబాబు ఇప్పటికే బాధ్యతలు స్వీకరించి క్షేత్రస్థాయిలో పనులు మొదలుపెట్టారు. ఉప ముఖ్యమంత్రి పవన్ మాత్రం ఈ నెల 19వ తేదీన తనకు కేటాయించిన శాఖలకు సంబంధించిన బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇందులోభాగంగా, ఆయన మంగళవారం సచివాలయానికి వెళ్ళి తనకు కేటాయించిన చాంబర్‌ను పరిశీలిస్తారు. బుధవారం నుంచి ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. 
 
మరోవైపు, సచివాలయంలో డిప్యూటీ సీఎంకు పవన్‌ సోమవారం ఛాంబర్‌ కేటాయించారు. రెండో బ్లాక్‌లోని మొదటి అంతస్తులో 212 గతిని ఆయన కోసం సిద్దం చేశారు. జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్‌కు కూడా అదే అంతస్తులో చాంబర్లు కేటాయించారు. కాగా, చంద్రబాబు మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించిన విషయం తెల్సిందే. నాదెండ్ల మనోహర్‌కు పౌరసరఫరాలు, కందుల దుర్గేశ్‌కు పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖలను కేటాయించారు.