మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 30 అక్టోబరు 2018 (14:38 IST)

రూ.40 వేలతో మందు.. విందు.. పొందు.. జగన్ దాడి కేసులోని నిందితుడి జల్సాలు

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో ప్రధాన నిందితుడైన శ్రీనివాస్ గురించి ఆసక్తికరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. 20 రోజుల క్రితం మురమళ్లలో కోనసీమ ఉత్సవాలు జరిగిన ప్రాంతంలో గోదావరి ఒడ్డున కొంతమంది స్నేహితులకు శ్రీనివాసరావు భారీ విందు ఇచ్చాడని.. ఆ విందుకు ఒక యువతిని కూడా తీసుకొచ్చినట్లు సమాచారం. ఈ విందుకు రూ.40 వేల వరకు చెల్లించినట్లు స్థానికులు చెబుతున్నారు. 
 
దీంతో దర్యాప్తు బృందం అధికారులు రంగంలోకి దిగారు. ఈ విందులో ఎవరెవరు పాల్గొన్నారు.. అక్కడ ఏం మాట్లాడుకున్నారనే విషయాలపై సిట్‌ ఎస్‌ఐ వెంకట్రావు ఒక్కొక్కరినీ విడివిడిగా విచారిస్తున్నారు. శ్రీనివాసరావు స్నేహితులు మెల్లం రాజు, పులిదిండి దుర్గాప్రసాద్‌, మెల్లం ప్రభాకర్‌, మద్దెల ప్రకాశ్‌ను పోలీసు స్టేషన్‌కు పిలిపించి ప్రశ్నించారు. అందరి వాంగ్మూలాలను రికార్డు చేశారు. శ్రీనివాసరావుకు వరుసకు సోదరుడైన జనిపెల్ల సోమేశ్వరరావుపై కూడా ఆరా తీస్తున్నారు.
 
ఇదిలావుంటే, వైసీపీ అధినేత జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనపై ఏదేని స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణకు ఆదేశించాలని కోరుతూ ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యం విచారణ వాయిదా పడింది. ఇదే అంశంపై దాఖలైన పిల్‌ మంగళవారం విచారణకు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యాజ్యం విచారణను వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.