సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (15:02 IST)

వివేకా రెండుసార్లు పెళ్లి చేసుకున్నారు... సునీత కూడా బెదిరించారు.. షమీమ్

తనను వైఎస్ వివేకానంద రెడ్డి రెండుసార్లు వివాహం చేసుకున్నారని వివేకా రెండో భార్యగా చెప్పుకుంటున్న షమీమ్ ఆరోపించారు. వివేకాకు షమీమ్ అనే రెండో భార్య ఉందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిలు గత కొంతకాలంగా ఆరోపిస్తూ ప్రచారం చేస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో షమీమ్ సీబీఐ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. 
 
వివేకాతో తనకు రెండుసార్లు వివాహం జరిగినట్టు చెప్పారు. తమ వివాహం వివేకా కుటుంబ సభ్యులకు ఏమాత్రం ఇష్టం లేదని చెప్పారు. ఈ విషయంలో శివప్రకాష్ రెడ్డి తనను ఎన్నోసార్లు బెదిరించారని, తన తండ్రికి దూరంగా ఉండాలని వివేకా కుమార్తె సునీతా రెడ్డి కూడా తనను బెదిరించారని చెప్పారు. 
 
ముఖ్యంగా, తన కుమారుడు పేరు మీద భూమి కొనాలని వివేకానంద రెడ్డి భావించారని, అయితే, వివేకాను శివప్రకాష్ రెడ్డి అడ్డుకున్నారని చెప్పారు. వివేకాను సొంత కుటుంబ సభ్యులే దూరం పెట్టారని, చెక్ పవర్ లేకుండా చేశారని, దీంతో ఆయన ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారని తెలిపారు. 
 
హత్య కావడానికి కొన్ని గంటల ముందు కూడా వివేకా తనతో మాట్లాడారని, బెంగుళూరులో ల్యాండ్ సెటిల్‌మెంట్లతో తనకు రూ.8 కోట్లు వస్తాయని చెప్పారు. అలాగే, వివేకా చనిపోయారని తెలిసి కూడా శివప్రకాష్ రెడ్డి అక్కడ ఉన్నారని తెలిసి భయంతో అక్కడకు వెళ్లలేక పోయినట్టు ఆమె తన స్టేట్మెంట్‌లో చెప్పారు.