కరక్కాయ చూర్ణంతో తేనె కలిపితే...
చాలామంది శరీర వేడివలన పలు ఇబ్బందులను ఎదుర్కుంటారు. అందుకు కరక్కాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఎలా అంటే.. కరక్కాయ ముక్కలను నీటిలో నానబెట్టి ఆ నీటిని ప్రతిరోజూ తీసుకుంటే శరీర వేడి తొలగిపోతుంది. గర్భిణులు వాంతులతో బాధపడుతుంటారు.. అలాంటప్పుడు కరక్కాయ పొడిని నీటిలో కలిపి సేవిస్తే వాంతులు తగ్గుతాయి. కరక్కాయ చూర్ణాన్ని ఆముదంలో కలిపి తీసుకుంటే కీళ్లనొప్పులు తగ్గుతాయి.
గుండె ఆరోగ్యానికి కరక్కాయ చూర్ణం చాలా మంచిది. గోరుచుట్ట వచ్చినప్పుడు కరక్కాయ పెచ్చులను పసుపు దుంపల రసంతో నూరి ఆ ప్రాంతంలో పెట్టుకుంటే అది పగిలి దాని నుండి ఉపశమనం లభిస్తుంది. కరక్కాయ పొడిలో కొద్దిగా పిప్పళ్ళ చూర్ణం, తేనె కలిపి ప్రతి 4 గంటలకు ఒకసారి తీసుకుంటే దగ్గు, గొంతునొప్పి తగ్గుతుంది. అలానే ఈ పొడిలో పటిక బెల్లాన్ని కలిపి సేవిస్తే రక్తసరఫరాకు చాలా మంచిది.
కరక్కాయ పెచ్చులను మెత్తగా నూరుకుని ఆ మిశ్రమాన్ని పాలలో కలుపుకుని తలకు రాసుకోవాలి. అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన చుండ్రు తొలగిపోతుంది. కరక్కాయ పొడితో పళ్లు తోముకుంటే చిగుళ్లు గట్టిపడుతాయి.
కామెర్ల వ్యాధితో బాధపడేవారు కరక్కాయ చూర్ణంలో కొద్దిగా తేనె, ఆవనూనె, కారం, చింతపండు, మసాలా వంటి వేసుకుని కూరలా తయారుచేసుకోవాలి. ఈ కూరను అన్నంలో కలిపి తీసుకుంటే కామెర్ల వ్యాధి తగ్గుతుంది.