1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By chitra
Last Updated : శనివారం, 2 జనవరి 2016 (11:42 IST)

తులసి ఆకులతో మరిగించిన నీళ్లను తాగితే..?

తులసి ఆకులు ఆయుర్వేదంలోనూ, ఇంటి వైద్యం లోను, దేవాలయంలోను విరివిగా వాడుతుంటారు. జలుబు, వాపులు, గుండె జబ్బులు, తలనొప్పి, పొట్ట సంబంధిత వ్యాధులు, మలేరియా వంటి వంటి వ్యాధులను నివారించడానికి తులసిని వాడుతారు. సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. మనం తులసి చెట్టును పూజిస్తారు కూడా. అయితే తులసితో కలిగే లాభాల గురించి చాలా మందికి తెలియదు. తులసి ఆరోగ్యంతో పాటు అందానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే తులసిని సర్వరోగ నివారిణి అంటారు. ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలు చూద్దాం...
 
మలేరియా వ్యాధితో సోకినపుడు కొన్నితులసి ఆకులను నలిపి మిరియాలపొడితో తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. తులసి ఆకుల్ని ఆరబెట్టి పొడి చేసి తేనెతో కలిపి తీసుకుంటే చాలా రోగాలు నుండి విముక్తి కలుగుతుంది. ఉదయాన్నే పరగడుపున తులసి రసాన్ని సేవిస్తే జీర్ణశక్తి మెరుగవుతుంది. 
 
తులసి రసాన్నికొంచెం అల్లం రసంతో కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. తులసి రసాన్ని మిరియాలపొడిలో వేసి ఆ మిశ్రమాన్ని కలిపి సేవిస్తే గ్యాస్ట్రిక్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసి ఆకులను నీళ్లలో మరిగించి తీసుకుంటే చెవి నొప్పికి మంచి మందుగా పనిచేస్తుంది. 
 
నల్ల తులసి ఆకులు, తేనేను సమపాళ్లలో కలిపి కళ్లకు రాసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది. తులసి రసాన్ని, నల్ల ఉప్పుతో కలిపి క్రమంగా తీసుకుంటే కడుపులో పురుగులు నశిస్తాయి. ఆస్తమా రోగులు ప్రతి రోజూ ఐదు నుంచి ఇరవైఐదు గ్రాముల నల్లతులసి రసాన్ని తేనేతో కలిపి తీసుకుంటే మంచిది.
 
ప్రతి రోజు కొన్నితులసి ఆకులను తినడం వలన రక్త శుద్ధి జరుగుతుంది. తులసి ఆకులను మజ్జిగతో కలిపి సేవిస్తే బరువు తగ్గుతారు. తులసి ఆకులు తినడం వలన చెడు శ్వాస తగ్గుతుంది. తులసి ఆకుల్ని పలురకాల జ్వరాల్లో ఉపశమనానికి ఉపయోగించుకోవచ్చు. 
 
వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ జ్వరం తీవ్రంగా ఉన్నప్పుడు తులసి ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించి తాగితే ఈ రకం జ్వరాల నుంచి ఉపశమనం కలుగుతుంది. జ్వరం మరీ తీవ్రంగా ఉంటే తులసి ఆకులనూ, మిరియాల పొడిని కలిపి మరిగించి కషాయం తయారు చేసుకుని తాగితే జ్వర తీవ్రత తగ్గుతుంది. 
 
పలురకాల ఆయుర్వేద దగ్గు మందుల్లో తులసిని తప్పకుండా వాడుతుంటారు. తులసి ఆకుల్ని నమలటం వల్ల జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసి ఆకులతో మరిగించిన నీళ్లను తాగితే గొంతులో గరగర నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ నీళ్లతో నోటిని పుక్కిలించినా మంచి ప్రయోజనం కనిపిస్తుంది. దగ్గు, జలుబు, జ్వరం, డయేరియా, వాంతులు వంటి సమస్యలకు తులసి ఆకుల రసాన్ని తాగిస్తే మంచి ఉపశమనం కనిపిస్తుంది.