చంద్రయాన్ 2: ఇస్రో విక్రమ్ ల్యాండర్‌తో మళ్లీ కనెక్ట్ అయ్యేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది?

Chandrayan 2
Last Updated: బుధవారం, 18 సెప్టెంబరు 2019 (19:13 IST)
చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్‌కు ఏం జరిగింది? అది సేఫ్‌గానే ఉందా లేక ధ్వంసమైందా? ఇస్రో ప్రయత్నాలకు అది ఎందుకు స్పందించడం లేదు. కోట్లాది మంది భారతీయుల్లో ఇవే అనుమానాలు. విక్రమ్ ల్యాండర్ ఆచూకీ దొరికిందని ఇస్రో ప్రకటించగానే భారతీయుల్లో ఆశలు చిగురించాయి. కానీ ల్యాండర్‌తో కమ్యూనికేషన్ ఇంకా సాధ్యపడలేదు. ఇంతకీ ఇస్రో ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది.. లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యోమనౌకను భూమి పైనుంచి ఎలా కంట్రోల్ చేస్తారు? నాసా ఇస్రోకి ఎలాంటి సాయం చేస్తోంది.

సెప్టెంబర్ 7న చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్ సమయంలో విక్రమ్ ల్యాండర్‌ నుంచి ఇస్రోకి కమ్యూనికేషన్ ఆగిపోయింది. అప్పటి నుంచి విక్రమ్‌తో కమ్యూనికేషన్ కోసం అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో ఇస్రో ప్రయత్నిస్తోంది. చంద్రుడిపై ల్యాండర్, రోవర్‌ 14 రోజుల పాటు మాత్రమే పనిచేస్తాయి. అంటే సెప్టెంబర్ 21 తేదీలోగా విక్రమ్ ల్యాండర్‌ను రీకనెక్ట్ చేయాలి. అందుకోసం ఇస్రో ఏం చేస్తోందో అర్థం కావాలంటే భూమిపై నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న శాటిలైట్లు, లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యోమనౌకలను శాస్త్రవేత్తలు ఎలా కంట్రోల్ చేస్తారో ముందు తెలుసుకోవాలి.

రాకెట్ నుంచి శాటిలైట్ విడిపోయిన తర్వాత దానితో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకోవాలంటే అదెక్కడుందో ముందు గుర్తించాలి. దీనికోసం రాడార్ ఉపయోగపడుతుంది. రాడార్ ఒక పల్స్ అంటే సిగ్నల్ పంపిస్తుంది. అది శాటిలైట్‌ను చేరి తిరిగొస్తుంది. ఇదంతా ఒక ప్రోగ్రామ్‌గా.. డీప్ స్పేస్ నెట్‌వర్క్ ద్వారా.. ఎలక్ట్రానిక్ సిగ్నల్‌ రూపంలో జరుగుతుంది. ఈ సంకేతాలను గ్రహించే యాంటెన్నాలు ప్రతి శాటిలైట్‌లో ఉంటాయి. ఉపగ్రహాలు రిసీవర్ల సాయంతో సిగ్నల్‌ను గ్రహించి, అర్థం చేసుకుని సైంటిస్టులు ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తాయి.

సింపుల్‌గా చెప్పాలంటే.. భూమిపై ఉండే గ్రౌండ్ స్టేషన్ నుంచి ఆ శాటిలైట్‌కు మాత్రమే అర్థమయ్యే ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ పంపిస్తారు. శాటిలైట్‌లో ఎలాంటి లోపం లేకపోతే, ఆ సంకేతాల్ని అందుకుని సైంటిస్టులు చెప్పినట్లు నడుచుకుంటుంది. వ్యోమనౌకలు లేదా అంతరిక్షంలోకి పంపే ప్రోబ్‌ల విషయంలోనూ ఇలాగే జరుగుతుంది. కాకపోతే ఉపగ్రహాలను గ్రౌండ్ స్టేషన్ నుంచి నియంత్రిస్తే.. వ్యోమనౌకలను డీప్ స్పేస్ నెట్‌వర్క్‌ ద్వారా కంట్రోల్ చేస్తారు. వ్యోమనౌకలతో కమ్యూనికేషన్‌ కోసం శక్తివంతమైన యాంటెన్నాలు ఉండాలి.

ఇలా వ్యోమనౌకలకు రేడియో కమాండ్స్ పంపించేందుకు ఇస్రో దగ్గర రెండు డీప్ స్పేస్ యాంటెన్నాలు ఉన్నాయి. బెంగళూరుకు సుమారు 45 కిలోమీటర్ల దూరంలోని బైలాలు గ్రామంలో DSN 32, DSN 18 యాంటెనాలున్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ సంస్థ వీటిని తయారు చేసిందని ఇస్రో వెబ్‌సైట్‌ చెబుతోంది. ఇండియన్ డీప్ స్పేస్ నెట్‌వర్క్‌ -IDSNలో భాగంగా చంద్రయాన్ 1 సమయంలో వీటిని ఏర్పాటు చేశారు.

గ్రహాంతర ప్రయోగాల కోసం వీటిని ఉపయోగిస్తున్నారు. ఇక్కడి నుంచే వ్యోమనౌకలకు కమాండ్స్ పంపిస్తారు. అక్కడి నుంచి వచ్చిన సంకేతాలను స్వీకరించి, విశ్లేషిస్తారు. ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌లో ఇదొక భాగం. 'కేవలం చంద్రుడి మీదే కాదు.. మార్స్, జుపిటర్ మీద పరిశోధనలకు పంపిన వ్యోమనౌకలతో కూడా ఇండియన్ డీప్ స్పేస్ నెట్‌వర్క్‌‌తో కమ్యూనికేట్ చేయొచ్చని' ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ N శ్రీ రఘునందన్‌ చెప్పారు.

విక్రమ్ ల్యాండర్‌తో ఇండియన్ డీప్ స్పేస్ నెట్‌వర్క్‌ ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది స్పందించడం లేదు. సెప్టెంబర్ 7న సిగ్నల్ ఆగిపోయే వరకు విక్రమ్ ల్యాండర్‌తో ఇస్రో ఇలాగే టచ్‌లో ఉంది. తమ సమాచారాన్ని నేరుగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు పంపించేలా ఆర్బిటర్, ల్యాండర్‌లను ప్రోగ్రామ్ చేశారు. కానీ ప్రజ్ఞాన్ రోవర్ తన సమాచారాన్ని నేరుగా భూమికి పంపించలేదు. ఆర్బిటర్‌తోనూ కమ్యూనికేట్ చేయలేదు. అది సమాచారాన్ని కేవలం విక్రమ్‌ ల్యాండర్‌కు మాత్రమే పంపించగలదు.

రోవర్ నుంచి సమాచారం స్వీకరించి దాన్ని ఎర్త్ స్టేషన్‌కి పంపించేలా విక్రమ్ ల్యాండర్‌ని ప్రోగ్రామ్ చేశారు. కానీ ఇప్పుడు విక్రమ్ ల్యాండర్‌తోనే సంబంధాలు తెగిపోయాయి. అందుకే రోవర్ ఇప్పుడెలా ఉందన్న దానిపై స్పష్టత లేదు. ఆర్బిటర్ ద్వారా కూడా విక్రమ్ ల్యాండర్ యోగక్షేమాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 'ప్రస్తుతం చంద్రయాన్ 2 ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ తిరుగుతోంది. సుమారు ప్రతీ రెండు గంటలకు ఒకసారి ఇది చంద్రుడిని చుట్టేస్తోంది' అని శ్రీరఘునందన్ చెప్పారు.

డీప్ స్పేస్ నెట్‌వర్క్, ఆర్బిటర్ ద్వారా ల్యాండర్‌తో కమ్యూనికేషన్ కోసం ఇస్రో ప్రయత్నిస్తోంది. ఇప్పుడు నాసా కూడా తన వంతు సాయం చేస్తోంది. ల్యాండర్‌ ప్రస్తుతం ఏ స్థితిలో ఉంది అని కనిపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇస్రో కంటే శక్తివంతమైన డీప్ స్పేస్ నెట్‌వర్క్ నాసాకి ఉంది. అమెరికాలోని కాలిఫోర్నియా, స్పెయిన్‌లోని మాడ్రిడ్, ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో DSN కేంద్రాలు ఉన్నాయి. ఈ మూడు కేంద్రాల్లో ఉన్న భారీ యాంటెన్నాలతో నాసా ఒక శక్తివంతమైన డీప్ స్పేస్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది.

భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 17 ఉదయం 8 గంటల ప్రాంతంలో మాడ్రిడ్‌లోని డీప్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్ 2 ల్యాండర్, ఆర్బిటర్‌తో మాట్లాడేందుకు నాసా ప్రయత్నించింది. సుమారు 4 లక్షల 20వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న విక్రమ్ ల్యాండర్‌కు సిగ్నల్ పంపించింది. ల్యాండర్‌కి CH2L అని, ఆర్పిటర్‌కి CH2O అని కోడ్‌నేమ్స్ పెట్టింది. నాసా పంపిన అప్‌లింక్ సిగ్నల్‌కి స్పందించి ఆర్బిటర్‌ పంపిన డౌన్‌లింక్ సిగ్నల్ కూడా మనం పైనున్న ఫోటోలో చూడొచ్చు. కానీ ల్యాండర్ నుంచి మాత్రం ఇంకా ఎలాంటి సమాచారం రావడం లేదు.

'ల్యాండర్‌తో కమ్యూనికేషన్ కోసం గత కొన్ని రోజులుగా నాసా ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. సౌర కుటుంబం చివరి దాకా వెళ్లిన వ్యోమనౌకతో కూడా కమ్యూనికేట్ అయ్యే సామర్థ్యం నాసా DSNకి ఉంది' అని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ N శ్రీ రఘునందన్‌ చెప్పారు. విక్రమ్ ల్యాండర్‌తో కమ్యూనికేషన్ కోసం ఇటు ఇస్రో.. అటు నాసా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే, ఏ ప్రయత్నమైనా సెప్టెంబర్ 21లోపే చేయాలి.

ఆ తర్వాత ఏం చేసినా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. ఎందుకంటే చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ కాల పరిమితి ఒక లూనార్ డే. అంటే భూమి మీద 14 రోజులకు సమానం. సెప్టెంబర్ 7న చంద్రుడిపై హార్డ్ ల్యాండయిన విక్రమ్ కాల పరిమితి సెప్టెంబర్ 21తో ముగుస్తుంది. ఆ తర్వాత విక్రమ్ ల్యాండర్ ఉన్న ప్రాంతం చీకటిలోకి వెళ్లిపోతుంది. చంద్రుడిపై సూర్యుడి వెలుగు పడిన చోట ఉష్ణోగ్రత 130 డిగ్రీల వరకు ఉంటే.. సూర్యకిరణాలు పడని ప్రాంతంలో ఉష్ణోగ్రత మైనస్ 180 డిగ్రీల వరకు ఉంటుంది.

దీనిపై మరింత చదవండి :