అనుష్క శర్మకు సెలక్టర్లు టీ ఇచ్చారన్న మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజినీర్‌ వ్యాఖ్యలపై కోహ్లీ భార్య ఏమన్నారు?

anushka - kohli
బిబిసి| Last Updated: శుక్రవారం, 1 నవంబరు 2019 (18:00 IST)
బాలీవుడ్ నటి, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ.. మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజినీర్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ప్రపంచకప్ సందర్భంగా క్రికెట్ టీమ్ సెలక్టర్లు అనుష్క శర్మకు టీ ఇచ్చే పనులు చేశారని ఫరూఖ్ ఇంజినీర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు, వాటిపై తలెత్తిన వివాదాలు, ఇతర అంశాలపై సవివరమైన వివరణ ఇస్తూ అనుష్క శర్మ ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో ఒక పోస్ట్ పెట్టారు.

ఆ పోస్టుల్లో అనుష్క శర్మ ఏం రాశారంటే..
‘ఇంతకాలం అలాగే అనుకున్నా..’
మనపై వచ్చే అసత్య, వండివార్చిన కథనాలపై స్పందించకుండా ఉండటమే మంచి పద్ధతి అని, అలా ఉండటమే మన విరోధులను సరిగ్గా ఎదుర్కోవటమని నేను ఎప్పుడూ అనుకునేదాన్ని. ఇలాగే నేను నా 11 ఏళ్ల కెరీర్‌ను చక్కబెట్టుకున్నాను. నా నిశ్శబ్దం నీడలోనే గౌరవాన్ని, వాస్తవాన్ని చూసుకున్నాను.


ఒక అబద్ధాన్ని పదేపదే చెబితే అది నిజమైపోతుందని అంటుంటారు. నా విషయంలో ఇదే జరుగుతోందని అనిపిస్తోంది. నా నిశ్శబ్దం నాకు వ్యతిరేకంగా ప్రచారమవుతున్న అబద్ధాలను నిజం చేస్తున్నట్లనిపిస్తోంది. అయితే, అది ఈ రోజుతో ముగుస్తుంది. అప్పట్లో నా బాయ్‌ఫ్రెండ్, ఇప్పుడు నా భర్త అయిన విరాట్ ప్రదర్శనకు నన్ను బాధ్యురాలిని చేసిన ప్రతిసారీ నేను ఏమీ మాట్లాడలేదు. భారత క్రికెట్‌కు సంబంధించిన చాలా నిరాధారమైన విషయాలకు నేను బాధ్యత తీసుకున్నాను. అప్పుడు కూడా నేను నిశ్శబ్దంగానే ఉన్నాను.

నేను క్లోజ్‌ డోర్ మీటింగుల్లో పాల్గొంటున్నానని, సెలక్షన్ ప్రక్రియను ప్రభావితం చేస్తున్నానంటూ అసత్య వార్తలు రాసినప్పుడు కూడా నేను ఏమీ మాట్లాడలేదు. నాకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, విదేశీ టూర్లలో నా భర్తతో కలసి అనుమతించిన దానికంటే ఎక్కువ సమయం గడుపుతున్నానని నా పేరును తప్పుగా ప్రస్తావించారు. కానీ, అసలు వాస్తవాలేమిటనేది బోర్డును అడిగి మాత్రం వీళ్లు తెలుసుకోలేదు. అలా తెలుసుకుని ఉంటే కనుక నేను ప్రతిసారీ ప్రొటోకాల్‌ ప్రకారమే నడుచుకున్నానని తెలిసేది. అయినా, నేను మాత్రం నిశ్శబ్దాన్నే పాటించాను.

‘నా టికెట్లు నేను కొనుక్కున్నా’
టికెట్లు, సెక్యూరిటీ, మొదలైన వాటి గురించి బోర్డును ఇబ్బందులు పెడుతున్నట్లు నా పేరు వాడుకుని తప్పుడు వార్తలు రాసినా.. వాస్తవంగా విమానాలకు, మ్యాచ్‌లకు అవసరమైన నా టికెట్లను నేనే సొంత ఖర్చులతో కొనుక్కున్నా. అయినా దీనిపై నేనేమీ మాట్లాడలేదు. హైకమిషనర్ భార్య గ్రూప్ ఫొటోలో ఉండమని నన్ను అడిగినప్పుడు, నేను వద్దని చెప్పినా కూడా ఆమె కోరగా.. నేనేదో కావాలనే అందులో భాగమైనట్లుగా, నాకు ఆహ్వానం ఉన్నప్పటికీ.. ఈ విందుకు నేనేదో కావాలనే వెళ్లినట్లు నన్ను తప్పుబట్టి, దీన్నో వివాదం చేసినా, దీనిపై బోర్డు అధికారికంగా వివరణ జారీ చేసినప్పటికీ, నేను మాత్రం ఏమీ మాట్లాడలేదు.

చెడు ఉద్దేశాలతో ప్రచారం చేసిన ఈ అబద్ధాలకు తాజా రూపం.. ప్రపంచకప్ మ్యాచ్‌ల సందర్భంగా సెలక్టర్లు నాకు టీ ఇచ్చారని. ప్రపంచకప్ జరుగుతున్నప్పుడు నేను ఒక మ్యాచుకు మాత్రమే హాజరయ్యాను. అప్పుడు కూడా నేను ఫ్యామిలీలకు కేటాయించిన బాక్సులోనే కూర్చున్నాను తప్ప (వార్తల్లో పేర్కొన్నట్లుగా) సెలక్టర్లకు కేటాయించిన బాక్సులో కాదు. కానీ, తమకు అనువైన రీతిలో మాట్లాడాలనుకునే వారికి నిజంతో సంబంధం ఏముంటుంది?

Kohli-Anushka
‘నా పేరు వాడొద్దు.. నన్ను వదిలేయండి’
సెలక్షన్ కమిటీ మీద, వారి నైపుణ్యాలమీద కామెంట్లు చేయాలనుకుంటే చేయండి. కానీ, ఇందులోకి నా పేరు లాగి, మీ వాదనను బలపర్చుకోవాలని, మీ అభిప్రాయాన్ని సంచలనం చేయాలని చూడకండి. ఇలాంటివాటికి ఎవరైనా సరే నా పేరు వాడుకోవడాన్ని నేను నిరాకరిస్తాను.
ఈ తాజా వార్తే నన్ను ఇబ్బంది పెట్టింది.. కాబట్టే నేను నా నిశ్శబ్దాన్ని వీడాలని నిర్ణయించుకున్నాను. నా పేరు వాడుకుని వచ్చినవన్నీ కూడా దుర్మార్గమైనవి, ద్వేషపూరితమైనవి, హానికరమైనవే. కాబట్టి, నా ఈ లేఖను ఈ న్యూస్‌కు తక్షణం ఇస్తున్న సమాధానంగా భావించొద్దు.

నేను ఈ రోజు గొంతెత్తాలనుకున్నాను. ఎందుకంటే ఒకరు నిశ్శబ్దంగా ఉన్నారంటే దాన్ని వారి బలహీనతగా భావించకూడదు కాబట్టి. నేను ఎవరి ఆలోచనలు, నమ్మకాలు, అజెండాల్లో పావును కాదు, కాదల్చుకోలేదు.
ఈసారి మీరు బోర్డును కానీ, మరెవరినైనా కానీ, ఆఖరికి నా భర్తనైనా సరే... విమర్శించాలనుకుంటే వాస్తవాలు, ఆధారాలతో విమర్శించండి. నా పేరును వాడొద్దు. నన్ను వీటి నుంచి వదిలేయండి. నేను చాలా గౌరవంగా జీవించాను. అంతే గౌరవంగా నా కెరీర్‌ను నిర్మించుకున్నాను. దాన్ని ఎవ్వరి కోసమూ కాంప్రమైజ్ చేయను. బహుశా ఎవరికైనా ఇది నమ్మటానికి కఠినంగా ఉండొచ్చు.

నేను నా అంతట నేనుగా ఎదిగిన స్వతంత్ర మహిళను. ఒక క్రికెటర్‌కు భార్య అయ్యాను.. అంతే. ఇక, రికార్డు కోసం, నేను కాఫీ తాగుతాను.

దీనిపై మరింత చదవండి :