శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 2 జనవరి 2020 (15:12 IST)

కొత్త ఏడాది తీర్మానాలను మధ్యలో వదిలేయకుండా అమలు చేయడం ఎలా?

బరువు తగ్గాలి. రోజూ వ్యామాయం చేయాలి. సిగరెట్ మానేయాలి. కొత్త భాష నేర్చుకోవాలి. ఇలా చెబుతూ పోతే కొత్త ఏడాదిలో తీసుకునే నిర్ణయాల జాబితా చాంతాడంత ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడం సులువే. మరి వాటిని అమలు చేస్తున్నారా? అంటే చాలామంది లేదనే చెబుతారు. కొత్త ఏడాది సందర్భంగా చేసుకున్న తీర్మానాలను చాలామంది పదిహేను రోజుల్లోనే అటకెక్కిస్తున్నారు.

 
తీర్మానాలు పక్కాగా అమల్లో పెట్టాలంటే ఏం చేయాలి?
ఏ నిర్ణయం తీసుకోవాలన్నది మీ ఇష్టం. ఇలాంటి తీర్మానాలే చేసుకోవాలని చెప్పడం లేదు. 'బీబీసీ రియాలిటీ చెక్‌' దీనిపై దృష్టి సారించింది. నిర్ణయాలను మధ్యలో వదిలేయకుండా కొనసాగించడం ఎలా అన్న దానిపై చేసిన అధ్యయనాలను బీబీసీ పరిశీలించింది. అందులో నిపుణులు చెప్పిన కొన్ని చిట్కాలు మీ కోసం అందిస్తోంది.

 
కొత్తగా సాధించడం కాదు.. కోల్పోయింది తిరిగి తెచ్చుకోండి!
కొత్తగా సాధించడం కంటే, కోల్పోయిన దాన్ని తిరిగి పొందడంలోనే మానవులు ఎక్కువ ప్రేరణ పొందుతారని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే కోల్పోయిన దాన్ని తిరిగి సాధించేలా తీర్మానం ఉండాలి. అది మీ పాత హాబీ కావొచ్చు. లేదంటే గతంలో ఉన్న మీ ఫిట్‌నెస్‌ కావొచ్చు.

 
ఫిట్‌నెస్‌ మరింత పెంచుకోవాలనే తీర్మానం కంటే, గతంలో ఉన్న ఫిట్‌నెస్‌ తిరిగి సాధించాలన్న నిర్ణయం ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అయితే, ఏ తీర్మానమైనా విజయవంతం కావాలంటే అన్నింటికన్నా ముఖ్యంగా అది వాస్తవానికి దగ్గరగా ఉండాలి. పట్టుదలతో పాటు కొన్ని చిట్కాలతో తీర్మానాలను మధ్యలో వదిలేయకుండా కొనసాగించవచ్చు.

 
మీ తీర్మానంలో ఇతరులకు భాగస్వామ్యం!
నిర్ణయాలు తీసుకోవడంలో, వాటిని అమలు చేయడంలో సామాజిక అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని వార్‌విక్ యూనివర్శిటీకి చెందిన తత్వవేత్త డాక్టర్ జాన్ మైఖేల్ అన్నారు. మీరు తీసుకున్న నిర్ణయాలు ఇతరులకు కూడా ముఖ్యమని భావిస్తే, వాటిని మీరు తప్పుకుండా కొనసాగించగలుగుతారు.

 
అంటే ఒకవేళ తీర్మానాన్ని మీరు పాటించకపోతే ఎదుటివారికి కష్టం కలుగే అవకాశం ఉంటే, మీకు ఇష్టం లేకున్నా దాన్ని కొనసాగిస్తారన్న మాట. ఉదాహరణకు ఒక స్నేహితుడితో కలిసి క్లాస్‌‌కి వెళ్లడం లాంటిది. ఆ క్లాస్‌కి డబ్బులు ముందే చెల్లిస్తే ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఒకరు వారి సమయాన్ని, డబ్బును మన కోసం వెచ్చించారని తెలిస్తే ఆ నిర్ణయాన్ని కొనసాగించేందుకే ఎక్కువగా ప్రయత్నిస్తాం.

 
'మన వల్ల మనకు నష్టం కలిగినప్పుడు కంటే, ఎదుటి వారికి నష్టం కలిగినప్పుడు ఎక్కువగా ప్రభావితం అవుతాం' అనే సిద్ధాంతాన్ని ప్రస్తుతం మైఖేల్ పరీక్షిస్తున్నారు. మనం కమిట్ అయిన పని కష్టంగా ఉన్నా.. బోర్ కొడుతున్నా.. ఆ పనిలో ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా భాగస్వాములు అయి ఉంటే, మనం తప్పనిసరిగా దాన్ని కొనసాగిస్తామని ఈ పరిశోధన చెబుతోంది.

 
మీ నిర్ణయం గురించి అందరికీ చెప్పండి!
సమాజంలో పరపతి కూడా చాలామంచి ప్రేరణ అందించే అంశం. కొత్త సంవత్సరంలో తీసుకున్న నిర్ణయాలను మీ చుట్టూ ఉండే వారికి చెప్పండి. స్నేహితులు, బంధువులు, సహోద్యోగులకు వివరించండి. దాంతో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండేందుకు మీరు తప్పనిసరిగా ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఆ నిర్ణయం గురించి అందరికీ చెప్పేశాం.. ఇప్పుడు మాట తప్పితే నలుగురిలో చులకన అయిపోతామన్న భయం మీలో ఉంటుంది.

 
బెట్ కట్టండి..బెంగలేకుండా ఉండండి!
'నిర్ణయాలు వాస్తవానికి దగ్గరగా ఉండాలి. బెట్టింగ్ కట్టడం ఒక రకంగా మేలు చేస్తుంది' అని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ నీల్ లెవీ అన్నారు. ఉదాహరణకు ఇక సిగరెట్ తాగబోనని మీ స్నేహితుడితో బెట్ కట్టండి. ఓడిపోతామన్న భయం సిగరెట్ తాగాలన్న కోరికను అణిచివేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తత్వవేత్తలు చెబుతున్నారు.

 
తీసుకునే నిర్ణయం చాలా వివరంగా, స్పష్టంగా ఉండాలని ప్రొఫెసర్ నీల్ లెవీ అన్నారు. అంటే 'ఇకపై జిమ్‌కి ఎక్కువగా వెళ్తా' అనే రొటీన్ రిజల్యూషన్ కాకుండా.. 'మంగళవారం మధ్యాహ్నం, శనివారం ఉదయం జిమ్‌కి వెళ్తాను' అని స్పష్టంగా క్లారిటీగా ఉండాలని ప్రొఫెసర్ నీల్ లెవీ తెలిపారు.

 
మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి!
తీర్మానాలు స్పష్టంగా ఉండటమే కాదు.. దాన్ని ఆపకుండా అమలు చేసేలా మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. ప్రొఫెసర్ నీల్ లెవీ దీన్నే 'ఇంప్లిమెంటేషన్ ఇన్‌టెన్షన్స్' అంటారు. ఒక కొత్త భాష నేర్చుకోవాలని అనుకుంటే, ముందు దానిపై ఆసక్తి పెంచుకోవాలి. ఆఫీస్‌కి వస్తున్నప్పుడో.. ఇంటికి వెళ్తున్నప్పుడో ఆ భాషకు సంబంధించిన వీడియోలు చూడండి. అలా చేస్తే కొత్త భాష నేర్చుకోవడం సులువు అవుతుంది. ఈ విషయం మర్చిపోకుండా ఉండేందుకు స్టిక్ నోట్స్ సిద్ధం చేసుకోండి. కేవలం నిర్ణయం తీసుకుంటే సరిపోదు.. దాన్ని అమలు చేసేందుకు చర్యలూ తీసుకోవాలి.

 
మినహాయింపులు అస్సలు ఇవ్వొద్దు!
మినహాయింపులు ఇవ్వడం మొదలైతే మొదటికే మోసం వస్తుంది. ఫ్రెండ్ పుట్టిన రోజు అనో.. నెలాఖరు అనో జిమ్‌కి వెళ్లడం మానేస్తే..క్రమంగా అదే అలవాటు అవుతుంది. ఏడాదికి ఒకట్రెండు మినహాయింపులు ఫర్లేదు. కానీ మినహాయింపులే అలవాటుగా మారకూడదు. 'ఈ నెలలో ఇది చివరి వారం కదా.. వచ్చే నెల ఫస్ట్ నుంచి మొదలు పెడదాం, ఇవాళ చాలా చలిగా ఉంది. రేపు వెళ్దాం' అని జిమ్‌కి వెళ్లడానికి బద్ధకిస్తే..మెల్లిమెల్లిగా అదే మీ దినచర్యగా మారుతుందని ప్రొఫెసర్ నీల్ లెవీ అన్నారు.

 
మీ దీర్ఘకాల ప్రణాళికలో వాటికీ చోటివ్వండి!
కొత్త ఏడాదిలో తీసుకునే తీర్మానాలు మీ దీర్ఘకాల ప్రణాళికలో భాగమై ఉండాలని ఆస్ట్రేలియాలోని జేమ్స్ కుక్ యూనివర్శిటీలో ప్రవర్తనా మనస్తత్వవేత్తగా పని చేస్తున్న డాక్టర్ ఆనీ స్విన్‌బ్రౌనీ చెప్పారు. అస్పష్టంగా, హడావుడిగా తీసుకునే నిర్ణయాల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని ఆయన అన్నారు. మీకు ఆటలంటేనే ఇష్టం లేదు. కానీ మంచి అథ్లెట్ కావాలని మీరు తీర్మానం చేసుకుంటే ఎలా సాధ్యం అవుతుంది? అందుకే వాస్తవానికి దగ్గరగా, నిజం చేసుకునేందుకు వీలుగా ఉన్న నిర్ణయాలే తీసుకోవాలి.

 
ఉదాహరణకు ప్రపంచమంతా చుట్టేయడం మీ కల అనుకుందాం. అందుకోసం 50 ఏళ్ల వయసు వచ్చేలోపు దానికి కావాల్సిన డబ్బు కూడబెట్టాలని నిర్ణయం తీసుకోవడం సత్ఫలితాలు ఇస్తుంది. ఏ నిర్ణయం తీసుకున్నా.. మీ దీర్ఘకాల ప్రణాళికలో భాగం చేయాలని ఆమె చెబుతున్నారు. ముందు మీ గురించి మీరు ఆత్మావలోకనం చేసుకోండి. దేని వల్ల మీరు వ్యసనాలకు బానిస అవుతున్నారో గుర్తించండి.

 
మద్యం తక్కువగా తాగాలని అనుకుంటే స్నేహితులను బార్‌లో కాకుండా కాఫీ షాపు‌లో కలవండి. తీర్మానానికి కట్టుబడి ఉండే విషయంలో సంకల్ప శక్తిపై ఆధారపడే వాళ్లు ఎక్కువగా విఫలం అవుతున్నారని డాక్టర్ ఆనీ స్విన్‌బ్రౌనీ చెప్పారు. 'ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండాలంటే దానికి సంబంధించి ఒక స్పష్టమైన సమగ్ర ప్రణాళిక ఉండాలి' అని అన్నారు.