సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Modified: సోమవారం, 20 మే 2019 (15:08 IST)

కేసీఆర్ కారు సూపర్ స్పీడు... జగన్ పంట పండింది... మోదీ వెల్కమ్ చెప్తారా?

కేంద్రంలో మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్ ఫలితాల సరళి సూచిస్తోంది. ఆ కూటమి 300 సీట్ల మార్కును అందుకునే అవకాశం ఉన్నట్లు ఆయా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 273 సీట్లు రావాలి. ఒంటరిగానే తాము 300కుపైగా సీట్లు గెలుస్తామని, ఉత్తర్‌ప్రదేశ్‌లోనే 74కుపైగా స్థానాలు సాధిస్తామని బీజేపీ చెబుతూవచ్చింది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఈ విషయంతో విభేదిస్తున్నాయి.
 
బీజేపీకే ఎక్కువ సీట్లు వస్తాయని అవి చెబుతున్నా, ఈసారి విపక్షాలు బలంగా కనిపిస్తున్నాయి. బీజేపీకి చాలా మంది మిత్రులు దూరమవడమే ఇందుకు కారణం. నరేంద్ర మోదీకి మళ్లీ అధికారం దక్కదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జోస్యం చెబుతూవచ్చారు. అది తప్పని తేలవచ్చు. కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు కలిసి మోదీకి అడ్డంకులు సృష్టించే అవకాశాలు కూడా ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి.
 
‘ద్వారాలతోపాటు కిటికీలూ తెరిచిపెట్టొచ్చు’
ఎన్డీయేకి మెజార్టీ రాకపోతే కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలను బీజేపీ ఆహ్వానించవచ్చు. ప్రధాని మోదీతో కలిసి ఇటీవల ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో.. తమ పార్టీ ఆలోచనలు నచ్చి ఎన్డీయేలో చేరేందుకు ముందుకు వచ్చే పార్టీలను స్వాగతిస్తామని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. బీజేపీ అన్ని ద్వారాలతోపాటు కిటికీలను కూడా తెరిచిపెట్టొచ్చని అనిపిస్తోంది. యూపీయేకు పార్టీలను దూరం చేసి తమతో కలుపుకునే వ్యూహాలను బీజేపీ మొదలుపెట్టింది.
 
కాంగ్రెస్ సొంతంగా వంద సీట్లైనా గెలుస్తుందని ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా చెప్పట్లేదు. అయితే, 2014లో ఆ పార్టీ 44 సీట్లే గెలిచింది. తాజా అంకెలను చూస్తుంటే, ఆ పార్టీలోని ఏ వర్గమూ రాహుల్ నాయకత్వం బాగా లేదని అనే అవకాశాలు కనిపించడం లేదు. ప్రియాంక గాంధీపై ఎంతవరకూ అంచనాలు పెట్టుకున్నారు, వాటిని ఆమె అందుకోగలిగారా, లేదా అన్న విషయాలను చూడాలి.
 
‘ప్రియాంక వచ్చినా...’
తూర్పు ఉత్తర్‌ప్రదేశ్ బాధ్యతలను ప్రియాంక తీసుకున్నా, అక్కడ కాంగ్రెస్ పరిస్థితి మారినట్లు కనపడటం లేదు. దీనికి చాలా కారణాలున్నాయి. కాంగ్రెస్ చెప్పిన కనీస ఆదాయ పథకంపై క్షేత్ర స్థాయిలో ప్రజలకు నమ్మకం కుదర్లేదు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒంటరిగా బరిలోకి దిగాలని కాంగ్రెస్ మంచి నిర్ణయమే తీసుకుంది. ప్రతి సారీ సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీలను పట్టుకుని వేలాడుతూ కాంగ్రెస్ తలదించుకుని ఉండటం ఆ పార్టీ క్యాడర్‌కు మంచిది కాదు.
 
కాంగ్రెస్‌కు ఇప్పుడు 40 స్థానాలు ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లుగా 80 సీట్లకు చేరుకుంటే, వారికి శుభవార్తే. అయితే, ప్రధాని పదవిని ఆశించే ఆ పార్టీ ఇప్పుడు మరింత కష్టపడాల్సి ఉంటుంది. పొత్తు విషయంలో మెతక వైఖరి చూపించక కాంగ్రెస్ తప్పు చేసింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ప్రజలందరికీ ఆ పార్టీ తెలుసు. ఓ జాతీయ పార్టీలా కాంగ్రెస్ నడుచుకోవాలి.
 
‘టీఎంసీతో మరింత వైరం’
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ పదుల సంఖ్యలో సీట్లను సొంతం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఆ రాష్ట్రంలో బీజేపీ శ్రమిస్తున్న తీరు చూసి తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలకూ భయం పట్టుకుంది. 10 నుంచి 15 మంది తమతో సంప్రదింపుల్లో ఉన్నారని బీజేపీ చెబుతోంది. ఇప్పుడు ఎవరెవరు ఏ పార్టీలోకి వెళ్తారన్నది చూడాలి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా సమీపంలోనే ఉన్నాయి. అయితే, టీఎంసీ మౌనంగా కూర్చోదు. ఆ పార్టీకి, బీజేపీకి రాబోయే రోజుల్లో వైరం మరింత పెరుగుతుంది.
 
‘ప్రచారంలోనే స్పష్టమైంది’
థర్డ్ ఫ్రంట్‌లో ఏ మొహాలు కనిపిస్తాయన్నది ఫలితాల తర్వాతే తెలుస్తుంది. తగినన్ని సీట్లు వస్తే ఆ పార్టీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ కచ్చితంగా ప్రయత్నిస్తుంది. అయితే, బీజేపీ కూడా వారిని ఎన్డీయేలో చేరమని కోరే అవకాశాలున్నాయి. కావాల్సిన హామీలు వస్తే ఆ పార్టీలు బీజేపీతో కలవొచ్చు. తెలంగాణలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో అమిత్ షా, నరేంద్ర మోదీ టీఆర్ఎస్‌పై దాడి చేయలేదు. కాంగ్రెస్‌నే వారు లక్ష్యంగా చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ జగన్‌పై కాకుండా, టీడీపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ ఎవరితో చేయి కలిపేందుకు సిద్ధమైందో అప్పుడే స్పష్టమైంది.
 
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌పై బీజేపీ బాగానే విమర్శలు చేసింది. ఆయనపై అవినీతి ఆరోపణలు మోపింది. అయితే, ఫనీ తుపాను సమయంలో మోదీ ఆ రాష్ట్రానికి వెళ్లినప్పుడు నవీన్ పట్నాయక్‌పై ప్రశంసలు కురిపించారు. నవీన్ పట్నాయక్‌తో చేయి కలపాలని అనుకుంటున్నట్లు ఆయన కనిపించారు. తమిళనాడులో ఆరు లేదా ఏడు సీట్లు ఎన్డీయేలోని ఏఐఏడీఎంకే గెలవొచ్చని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో యూపీఏ బలంగా కనిపిస్తోంది.