శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (11:10 IST)

లవ్ జిహాద్ కేసు: పోలీసులు, కోర్టుల చుట్టూ తిరిగిన ఆ యువ జంటకు ఏమైంది?

ఆ ఇంటి బయట చూడగానే ఒక పెద్ద మోడువారిన చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు కొమ్మలు వంగిపోయి ఇంటి తలుపు, పైకప్పు మీదకు కూడా వచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ రెండు ఇళ్లు కనిపిస్తున్నాయి. ఆ రెండు ఇళ్ల కిటీకీలు దాదాపుగా కలిసే ఉన్నాయి. వీటిలో ఒక ఇంటిలో రషీద్ తండ్రి మహమ్మద్ రజా అలీ నివాసముంటున్నారు.

 
కొన్ని నెలల క్రితం ఇక్కడ ఒక అమ్మాయి తన భర్త కోసం ఎదురుచూస్తూ గడిపేది. అవి నిజంగా ఆమెకు బాధాకరమైన రోజులు. ఆమె భర్త జైలు నుంచి విడుదలైనప్పుడు.. ఆమె నవ్వుతూ ఇంటిలోకి తీసుకొని వచ్చింది. ఆమెను బలవంతంగా మతమార్పిడి చేసి పెళ్లి చేసుకున్నారనే ఆరోపణలపై అతణ్ని జైలుకు పంపించారు. ''లవ్ జిహాద్'' పేరుతో ఇక్కడ కొన్ని సంస్థలు గందరగోళం సృష్టించాయి. ఆమె భర్త జైలుకు వెళ్లడానికి వారే కారణం. ఆరు నెలల క్రితం తన అంగీకారంతోనే రషీద్ తనను పెళ్లి చేసుకున్నాడని బీఏ చదువుకున్న పింకీ వెల్లడించింది.

 
మరోవైపు నారీ నికేతన్‌కు తనను తరలించారని, అక్కడే తనకు గర్భస్రావం అయ్యిందని ఆమె తెలిపారు. అయితే తన ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నానని ఆమె పదేపదే వెల్లడించారు. జైలు నుంచి తన భర్త రషీద్‌ను విడిపించేందుకు ఆమె న్యాయ పోరాటం కూడా చేశారు. ఎట్టకేలకు తన భర్త జైలు నుంచి విడుదల అయ్యారు. అయితే వారు ఇక్కడ ఉండటం లేదు. ఈ ప్రాంతాన్ని వదిలి వేరేచోటకు వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ పాత ఇంటికి తాళం వేసి ఉంది. పింకీతోపాటు ఈ ఇల్లు గురించి ఇప్పుడు ఎవరూ మాట్లాడటంలేదు.

 
ఇక్కడ అంతా నిశ్శబ్దం అలుముకుంది. ఇక్కడ రషీద్ తండ్రి మహమ్మద్ రజా అలీ మాత్రమే నివసిస్తున్నారు. రోడ్డుకు అవతలివైపు ఓ దుకాణం లోపల ఒక వృద్ధ మహిళ కూర్చొని ఉన్నారు. రషీద్ తండ్రి మద్యానికి బానిసని ఆమె చెప్పారు. ''ఆయన ఏం చెబుతాడు? చిన్నచిన్న పనులు చేసుకుంటాడు. వచ్చే డబ్బులతో మద్యం తాగేస్తాడు. మాకు ఏ సంగతీ తెలియదు. అసలు వారెవరో కూడా తెలియదు''అని ఆమె వ్యాఖ్యానించారు. బరేలీ జైలు నుంచి రషీద్ విడుదలైన వెంటనే ఆ జంట ఇక్కడి నుంచి వెళ్లిపోయింది. వారి కథ చెప్పడానికి ఇప్పుడు వారు అందుబాటులో లేరు.

 
''ఇప్పుడు కథ అంతా ముగిసిపోయింది. వారు చాలా పేదవాళ్లు. పైగా ముస్లింలని భయపడుతున్నారు. ఎవరి మీదా వారు కేసులు పెట్టాలని అనుకోవట్లేదు. ఈ విషయంపై వారు మాట్లాడాలని కూడా అనుకోవట్లేదు''అని వారి తరఫు న్యాయవాది జుల్ఫికర్ ఠేకేదార్ చెప్పారు. ''ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను వాట్సాప్, ఈ-మెయిల్ నుంచి కూడా నేను డిలీట్ చేసేశాను''అని ఆయన వివరించారు. నారీ నికేతన్‌లో గర్భస్రావం అయ్యిందని చెప్పడంతో పింకీ కేసు మరోసారి ఇటీవల వార్తల్లో నిలిచింది. భర్తను అరెస్టు చేసిన అనంతరం ఆమెను పోలీసులు నారీ నికేతన్‌కు తరలించారు.

 
పింకీతో సంబంధమున్న ఒక వీడియో ఇటీవల వైరల్ అయ్యింది. దీనిలో బజ్‌రంగ్ దళ్‌కు చెందిన కొందరు కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌ లోపల నినాదాలు చేస్తున్నారు. వివాహానికి సంబంధించిన పత్రాలు చూపించాలని మళ్లీమళ్లీ గట్టిగా అడుగుతున్నారు. పత్రాలు చూపించినప్పటికీ, రషీద్ ఆమెను బలవంతంగా మతమార్పిడి చేసి, పెళ్లి చేసుకున్నాడని బజ్‌రంగ్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

 
ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలియదు..
ఇప్పుడు రషీద్, పింకీ ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. వారు దేహ్రాదూన్ వెళ్లిపోయారని కొందరు చెబుతున్నారు. అక్కడ సెలూన్ షాప్‌లో రషీద్ పనిచేసేవాడు. అక్కడే తొలిసారి అతడు పింకీని కలిశాడు. అయితే వారు బంధువుల ఇంట్లో ఉంటున్నారని రషీద్ తండ్రి చెబుతున్నారు. రషీద్ దగ్గర డబ్బులేమీ లేవని, ఇక్కడే ఉంటే చంపేస్తారని భయపడుతున్నాడని తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్ మోరాదాబాద్‌లోని కాంఠ్‌ చాలా సున్నితమైన ప్రాంతం. ఇక్కడ ఇదివరకు అల్లర్లు కూడా చెలరేగాయి.

 
2014లో మతానికి సంబంధించిన వివాదంపై తీర్పు చెప్పేందుకు ఇక్కడ ఒక ''మహా పంచాయత్'' ఏర్పాటైంది. ఆ సమయంలో చాలామంది బీజేపీ వర్కర్లు పోలీసులతో ఘర్షణకు దిగారు. 2013లోనూ ముజఫర్‌నగర్‌లో ఓ మహాపంచాయత్ తీర్పు అనంతరం ఘర్షణలు చెలరేగాయి. వీటిలో 60 మంది మరణించారు. 40 వేల మందిని ఇక్కడి నుంచి వేరేచోటకు తరలించారు. ఇక్కడ హిందూ జనాభా తగ్గిపోతోందనే ప్రచారాలు అప్పుడప్పుడూ జరుగుతుంటాయి. మతాంతర వివాహాలే దీనికి కారణమని, వాటిని ఎలాగైనా అడ్డుకోవాలని కొన్ని సంస్థలు ప్రచారాలు చేస్తుంటాయి.

 
పింకీది బిజ్నోర్ జిల్లా. లాక్‌డౌన్ సమయంలో, అంటే జులైలో రషీద్‌ను దేహ్రాదూన్‌లో పెళ్లి చేసుకున్న అనంతరం, పింకీ తన పేరును ''ముస్కాన్ జహాన్''గా మార్చుకున్నారు. దేహ్రాదూన్‌లోనే లోన్ ఏజెంట్‌గా పింకీ పనిచేసేవారు. 2019లో తొలిసారిగా ఆమె రషీద్‌ను కలిశారు. పెళ్లి అనంతరం తను రషీద్‌తోపాటు మొరాదాబాద్‌కు వచ్చేశారు. రషీద్ తండ్రి ఇక్కడే ఉంటారు. రషీద్-పింకీల పెళ్లిని రిజిస్టర్ చేయించాలని చాలా మంది ఆయనకు సూచించారు. యూపీలో మతమార్పిడిలకు వ్యతిరేకంగా ఆర్డినెన్స్ తీసుకువస్తున్న నేపథ్యంలో పెళ్లిని త్వరగా రిజిస్టర్ చేయించాలని సూచించారు.

 
రషీద్ తల్లి చనిపోవడంతో 2003లో రషీద్ తండ్రి మహమ్మద్ రజా మరో పెళ్లి చేసుకున్నాడు. అయితే, రషీద్‌ను, అతడి భార్యను ఇంటిలోకి రానివ్వనని, తన ఆస్తిలో వాటా కూడా ఇవ్వనని మహమ్మద్ రజా అన్నారు. ''నా ఇష్టానికి వ్యతిరేకంగా వారు పెళ్లి చేసుకున్నారు. నేను ఏం చేయాలి? జైలుకు పొమ్మంటారా? కోర్టుకు వెళ్లొద్దని చెప్పాను. కానీ పింకీ వినలేదు. పెళ్లిని రిజిస్టర్ చేయిస్తాను అంటూ వెళ్లింది. లాయర్‌కు కూడా రూ.7,000 కట్టింది''అని ఆయన వ్యాఖ్యానించారు.

 
డిసెంబరు 5న తమ పెళ్లిని రిజిస్టర్ చేయించుకునేందుకు మొరాదాబాద్ తహశీల్దార్ కార్యాలయానికి పింకీ, రషీద్ వెళ్లారు. అయితే, వారిని బజ్‌రంగ్ దళ్ కార్యకర్తలు చుట్టుముట్టారు. వివాహ పత్రాలు చూపించాలని అడిగారు. వారే వీరిద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ''ఆరు నెలల క్రితం తన ఇష్టపూర్వకంగానే రషీద్‌ను పెళ్లి చేసుకున్నానని చెప్పడంతో పోలీసులు వారిని వదిలిపెట్టేశారు''అని రషీద్ కుటుంబ స్నేహితుడు ఒకరు చెప్పారు. ''ఎలాంటి బలవంతపు మతమార్పిడి ఆధారాలు లేకపోవడంతో వారిని విడిచిపెట్టారు. కానీ బజ్‌రంగ్ దళ్ కార్యకర్తలు అంతటితో ఆగలేదు. వారు పింకీ తల్లిని బిజ్నోర్ నుంచి తీసుకొని వచ్చి కేసు పెట్టించారు. ఈ కేసు వల్లే పోలీసులు ఆ జంటను అదుపులోకి తీసుకున్నారు''అని అతడు వివరించారు.

 
రషీద్‌ను ఆ తర్వాత జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మరోవైపు పింకీని పోలీస్ స్టేషన్‌లో ఏడు గంటలపాటు ఉంచినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత డిసెంబరు 6న, మధ్యాహ్నం రెండు గంటలకు ఆమెను మొరాదాబాద్‌లోని నారీ నికేతన్‌కు తరలించారు.

 
కూతురుపై ఎందుకు ఫిర్యాదు చేశారు?
పింకీ తల్లి బాలా దేవి.. షెడ్యూల్ కులాలకు చెందిన వారు. బిజ్నోర్‌లోని ఒక మారుమూల గ్రామంలో వీరు నివసిస్తున్నారు. డిసెంబరు 5న కాంఠ్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీలోని సెక్షన్ 154 కింద ప్రాథమిక విచారణ నివేదిక (ఎఫ్‌ఐఆర్)ను నమోదు చేయించారు. రషీద్, అతడి సోదరుడు సలీం కలిసి పింకీని మోసం చేసి, పెళ్లి చేసుకున్నారని ఆమె ఫిర్యాదులో ఆరోపించారు.

 
ఆ ఎఫ్‌ఐఆర్ కాపీని బీబీసీ న్యూస్ సంపాదించింది. ''డిసెంబరు 1న రషీద్ తమ కుమార్తెను ఇంటి నుంచి తీసుకెళ్లిపోయాడు. పింకీని వెనక్కి తీసుకొని వచ్చేందుకు కాంఠ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడే అతడు ముస్లిం అని తెలిసింది. అతడు కావాలనే తన మతాన్ని దాచిపెట్టాడు''అని పింకీ తల్లి ఆరోపించారు. ''నా కూతుర్ని బుర్కాలో చూశాను. రషీద్ ఇంటి పరిసరాల నుంచి తనను మేం తీసుకొని వచ్చాం. ఎనిమిది గంటలకు వారిద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చాం''అని పింకీ తల్లి పేర్కొన్నారు. ''మా అమ్మాయిని వారు చాలా బెదిరించారు. అందుకే తను అలా మాట్లాడుతోంది. అందుకే నేను ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించాను''అని ఆమె వివరించారు.

 
''ఇది మా పరువుకు సంబంధించిన వ్యవహారం. మా అమ్మాయి కనిపించకుండా పోయింది. ఆమెను వెతికి పెట్టడంలో బజ్‌రంగ్ దళ్ కార్యకర్తలు సాయం చేశారు''అని ఆమె ఫోన్‌లో చెప్పారు. మరి ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయించారని ప్రశ్నించగా? ''అవన్నీ నాకు తెలియదు. మా అమ్మాయిని వెతికి పట్టుకోవడంలో బజ్‌రంగ్ దళ్ కార్యకర్తలు మాకు సాయంచేశారు''అని ఆమె వివరించారు. కొన్ని రోజులపాటు పింకీని నారీ నికేతన్‌లో ఉంచారు. ఆ తర్వాత స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి ఆమెను తీసుకెళ్లారు. డిసెంబరు 15న మళ్లీ రషీద్ కుటుంబానికి ఆమెను అప్పగించారు.

 
అయితే, నారీ నికేతన్‌లో తనను హింసించారని పింకీ చెబుతున్నారు. ''రక్త స్రావం అవుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. తగిన చికిత్స అందించలేదు. అందుకే గర్భస్రావం అయ్యింది''అని ఆమె ఆరోపించారు. అయితే ఆమె చేసే ఆరోపణల్లో నిజంలేదని పోలీసులు చెబుతున్నారు. రషీద్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఈ కేసును ముందుకు తీసుకెళ్లడం ఇష్టంలేదని ఈ జంట స్పష్టంచేసింది. ఎవరిపైనా తాము కేసులు పెట్టాలని భావించడంలేదని తెలిపింది.

 
''బజ్‌రంగ్ దళ్‌పై కేసు పెట్టడానికి వారి దగ్గర తగిన ఆధారాలు లేవు. మరోవైపు రషీద్ తండ్రి కూడా మాకు సహకరించడం లేదు. అందుకే కేసును వెనక్కి తీసేసుకున్నాం''అని రషీద్ లాయర్ తెలిపారు. మొరాదాబాద్‌లోని కాంఠ్ తహశీల్ పరిధిలోని జనాభాలో 54 శాతం మంది హిందువులు ఉంటారు. ముస్లింల వాటా 44 శాతం వరకు ఉంటుంది. పత్తేగంజ్‌లో రషీద్, పింకీ నివాసముండేవారు. లాక్‌డౌన్ సమయంలో వీరికి ఎలాంటి ఉపాధి దొరకలేదు. పింకినీ పెళ్లి చేసుకున్నట్లు జులైలో తల్లిదండ్రులకు రషీద్ చెప్పాడు. సెప్టెంబరులో వీరు ఇంటికి వచ్చారు.

 
హిందూ అమ్మాయిలని కాపాడతామని...
మోను విష్ణోయ్.. తనని తాను బజ్‌రంగ్ దళ్ కాంఠ్ విభాగం ఆర్గనైజర్‌గా చెప్పుకుంటుంటారు. మెడకు కాషాయ వస్త్రం కట్టుకుని ఆయన తిరుగుతుంటారు. ఇక్కడ అందరూ ఆయన్ను గుర్తుపడతారు. యువ లాయర్లు ఆయనకు నమస్తేలు పెడుతుంటారు. ఒక స్థానిక రిపోర్టర్ ఎప్పుడూ ఆయన వెంటే తిరుతుంటారు. ఆమెనే మోను ఫోన్‌ను ఎత్తుతుంటారు. ''నేను ముందు హిందువుని. ఆ తర్వాతే రిపోర్టర్‌ను. హిందూ ధర్మాన్ని కాపాడడానికి చేయాల్సిందంతా మోను చేస్తున్నారు''అని ఆమె ఫోన్‌లో చెప్పారు.

 
పింకీ, రషీద్‌ల విషయాన్ని పోలీసులకు చెప్పింది మోనునే. అయితే, వారిద్దరికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఘటనల్లో తనకు ఎలాంటి పాత్రాలేదని ఆయన అంటున్నారు. ''పోలీస్ స్టేషన్లో డాక్యుమెంట్లు చూపించాలని మీ మద్దతు దారులు డిమాండ్ చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అలా అడగడానికి మీకు ఏం హక్కులు ఉన్నాయి?''అని మేం ఆయన్ను ప్రశ్నించాం. ''ఆ అమ్మాయి కొన్ని తప్పుడు పత్రాలు చూపిస్తోంది. అందుకే మా కార్యకర్తలు ప్రశ్నలు అడిగారు. ఇందులో తప్పేముంది?''అని ఆయన సమాధానం ఇచ్చారు.

 
35ఏళ్ల మోను ఏడేళ్ల క్రితం బజ్‌రంగ్ దళ్‌లో చేరారు. మెయిన్ మార్కెట్‌లో ఆయనకు ఒక దుకాణం కూడా ఉంది. స్థానిక ఆరెస్సెస్ నాయకుల చర్యలతో తను చాలా ప్రభావితం అయినట్లు మోను చెబుతున్నారు. తన ప్రజల కోసం పనిచేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని ప్రమాణం చేసినట్లు ఆయన చెప్పారు. ''మేం హిందూ మహిళల్ని కాపాడాలని అనుకుంటున్నాం. అమ్మాయిల్ని లవ్ జిహాద్ నుంచి కాపాడటం మా కర్తవ్యం''అని ఆయన వ్యాఖ్యానించారు.

 
''చాలా రోజుల నుంచి ఇక్కడ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి కేసులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు మాకు ఒక నెట్‌వర్క్ ఉంది. మహిళలు.. తమ కుటుంబం, సమాజ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాలి. అలాంటి వివాహాలు జరగకుండా మేం అడ్డుకుంటున్నాం. ఎలా అడ్డుకుంటాం అనేది మీకు చెప్పం. అయితే మాకంటూ ఒక వ్యవస్థ ఉంది. ఇది ఎప్పటికప్పుడు మాకు సమాచారం ఇస్తుంది. దీని ఆధారంగానే చర్యలు తీసుకోవాలని మేం పోలీసులను అడుగుతాం''అని మోను అన్నారు. పింకీ గురించి తన తల్లే సాయం చేయాలంటూ తమ వద్దకు వచ్చినట్లు మోను వివరించారు.

 
''బజ్‌రంగ్ దళ్ కార్యకర్తలే పింకీ తల్లిని తీసుకొచ్చి, దగ్గరుండి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించారు. పింకీ సమర్పించిన పత్రాల్లో ఆమె చిరునామా ఉంది. దాని ప్రకారమే వారు ముందుకు వెళ్లారు. ఒకవేళ పింకీ తల్లికి ముందే అభ్యంతరాలు ఉంటే, ముందే ఆమె ఎందుకు ఫిర్యాదు నమోదు చేయాలేదు?''అని రషీద్ ఇంటి పొరుగున ఉండే వ్యక్తి ప్రశ్నించారు. ''పింకీ తల్లిని కారులో కూర్చొబెట్టుకుని బజ్‌రంగ్ దళ్ కార్యకర్తలు కాంఠ్‌కు తీసుకువచ్చారు. రషీద్‌పై ఫిర్యాదు చేయాలని వారే చెప్పారు. బజ్‌రంగ్ దళ్ ఒత్తిడిపై పోలీసులు కేసు నమోదు చేశారు''అని ఆయన వ్యాఖ్యానించారు.

 
పోలీసుల మౌనం
''ఈ కేసుకు సంబంధించి తమ దర్గర ఎలాంటి సమాచారం లేదు''అని కాంఠ్ తహ్‌శీల్‌లోని ఛజలైత్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీసర్ బలరామ్ సింగ్ చెప్పారు. అయితే, తన వివాహానికి సంబంధించి ఎలాంటి రుజువులను పింకీ చూపించలేకపోయిందని ఆయన చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ''ఈ కేసు గురించి నాకు ఏమీ తెలియదు. బజ్‌రంగ్ దళ్‌కు దీనితో ఏం సంబంధమూ లేదు''అని ఆయన వ్యాఖ్యానించారు. కాంఠ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి అజయ్ కుమార్ గౌతమ్‌తో మాట్లాడమని మాకు సూచించారు. ''నేను ఇక్కడ కూర్చుంది మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి కాదు. ప్రపంచం మొత్తానికి మీరేమైనా కాంట్రాక్ట్ తీసుకున్నారా?''అని ఆయన వ్యాఖ్యానించారు.

 
''ఆ అమ్మాయిపై బజ్‌రంగ్ దళ్ కార్యకర్తలు అరుస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. మీరు వారిని ఎందుకు అరెస్టు చేయలేదు?''అని ఆయన్ను మేం ప్రశ్నించాం. ''ఆ అమ్మాయి వాళ్ల అమ్మ, సోదరి పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు ఇచ్చారు. ఆ తర్వాత నారీ నికేతన్‌కు వెళ్లడానికి పింకీ ఒప్పుకుంది. దీంతో బజ్‌రంగ్ దళ్‌కు ఎలాంటి సంబంధమూ లేదు. మేం చట్టం ప్రకారం విధులు నిర్వర్తిస్తున్నాం. నారీ నికేతన్‌లో ఉన్నప్పుడు పింకీకి గర్భస్రావం కాలేదు. మా దగ్గర ఇంతే సమాచారం ఉంది. తన ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నానని ఆ అమ్మాయే చెప్పిన తర్వాత, ఆమె హాయిగా ఇంటికి వెళ్లిపోవచ్చు. ఇప్పుడు మీరు కూడా వెళ్లిపోవచ్చు''అని ఆయన వ్యాఖ్యానించారు.

 
పింకీని మొరాదాబాద్ సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు. అప్పుడే నారీ నికేతన్‌ నుంచి ఆమెను అత్తింటికి పంపించాలని కోర్టు సూచించింది. తన భర్త, అతడి సోదరులను విడిచిపెట్టాలని ఆమె కోర్టును కోరింది. పింకీ, రషీద్ నివసించిన ఇంటి ముందు మేం నిలబడ్డాం. ఆ ఎండిపోయిన చెట్టు, ఒంగిన కొమ్మలతో అక్కడే ఉంది. ఆ ఇంటికి తాళం వేసుంది. ఏం జరిగిందో ఒప్పుకోవడానికి ఎవరూ సిద్ధంగాలేరు. అందరూ దీని గురించి మరచిపోయారు. వారు ఈ సంఘటనను మరిచిపోవడానికి ఇక్కడి నుంచి వెళ్లిపోలేదు. ప్రశాంతంగా జీవించడానికి వెళ్లిపోయారు.