శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 31 మార్చి 2021 (13:04 IST)

పాన్‌ కార్డ్‌ - ఆధార్ లింక్‌: ఆన్‌లైన్‌లో రెండు నిమిషాల్లో ఇలా చేసేయండి..

పాన్‌ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడం తప్పనిసరి. పాన్‌ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోవడానికి ఇవాళే (31 మార్చ్ 2021) ఆఖరి తేదీ. ఆధార్‌తో లింక్‌ చేయకపోతే ఆ పాన్‌కార్డు పని చేయదు. వెయ్యి రూపాయల వరకు జరిమానా కట్టాల్సి రావొచ్చు.

 
మరి, వీటిని ఎలా లింక్ చేయాలి?
రెండు నిమిషాల్లోనే పాన్‌ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయవచ్చు. పాన్‌ కార్డును ఆధార్‌ నెంబర్‌తో అనుసంధానం చేయడం చాలా సులభం. ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్‌ వెబ్‌సైట్‌ ద్వారా సులువుగా లింక్ చేసుకోవచ్చు. ఇదివరకే రిజిస్టర్ చేసుకున్న యూజర్లు ఇన్‌కం టాక్స్ ఇండియా ఇ ఫైలింగ్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి.. యూజర్ ఐడీ, పాస్‌వర్డుతో లాగిన్ కావాలి.

 
ప్రొఫైల్ సెట్టింగ్‌లోకి వెళ్తే 'లింక్‌ ఆధార్' అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ అడిగిన వివరాలు ఇచ్చి పాన్‌ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోకపోయినా కంగారుపడాల్సిన పనిలేదు. అలాంటి వాళ్లు ఇన్‌కం టాక్స్ ఇ ఫైలింగ్ వెబ్‌సైట్‌ ఓపెన్ చేసి, హోమ్‌పేజీలో ఎడమవైపు ఉన్న 'లింక్‌ఆధార్' అనే ఆప్షన్‌ ఎంచుకోవాలి. అక్కడ పాన్‌కార్డు నెంబర్, ఆధార్ నెంబర్, మీ పేరు ఎంటర్ చేస్తే పనైపోయినట్లే. లేదంటే ఈ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకుని ఆ తర్వాత పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయవచ్చు.

 
SMS పంపించి లింక్ చేసుకోవచ్చు
SMS పంపించి కూడా పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవచ్చు. 567678 లేదా 56161 నెంబర్‌కి SMS పంపిస్తే లింక్ అయిపోతుందని ఇన్‌కం టాక్స్ డిపార్ట్‌మెంట్ చెబుతోంది. UIDPAN అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 12 అంకెల ఆధార్ నెంబర్ రాసి స్పేస్ ఇచ్చి 10 అంకెల పాన్ కార్డు నెంబర్ రాసి 567678 లేదా 56161 నెంబర్‌కి SMS చేయాలి.

 
ఉదాహరణకి మీ ఆధార్ నెంబర్ 123456789012 అని, పాన్ నెంబర్ ABCDE1234S అని అనుకోండి. అప్పుడు SMS ఇలా పంపించాలి. UIDPAN 123456789012 ABCDE1234S అని టైప్ చేసి 567678 లేదా 56161 నెంబర్‌కి SMS పంపించాలి. అయితే, మీ మొబైల్ నెంబర్ ఆధార్‌ డేటాబేస్‌లో నమోదై ఉంటేనే ఇది పనిచేస్తుంది.

 
వివరాలు మ్యాచ్ అయితేనే లింక్ అవుతుంది
పాన్‌కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసేటప్పుడు ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. పాన్‌ కార్డులోని వివరాలు, ఆధార్ కార్డులో ఉన్న వివరాలతో మ్యాచ్ కావాలి. అప్పుడే ఈ రెండూ అనుసంధానం అవుతాయి. చాలా మందికి ఇక్కడే సమస్య ఎదురవుతోంది. కొందరి పేరు, పుట్టిన తేదీ ఆధార్‌లో ఒకలా.. పాన్‌ కార్డులో మరోలా ఉంటోంది.

 
అలాంటి వాళ్లు వెబ్‌సైట్ ద్వారా లేదా SMS పంపించి పాన్‌ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోలేరు. ఇలాంటి సమస్య ఉన్న వాళ్లు ముందుగా పాన్ కార్డు లేదా ఆధార్‌ కార్డులో తప్పుగా ఉన్న వివరాలు సరిచేసుకోవాలి. ఆ తర్వాత ఇంతకుముందు చెప్పిన విధంగా అనుసంధానం చేసుకోవచ్చు.

 
పాన్ సర్వీస్ సెంటర్లు నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ -NSDL లేదా యూటీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ - UTIITSL కేంద్రాలకు వెళ్లి కూడా ఆధార్-పాన్ లింక్ చేసుకోవచ్చు. దీని కోసం ఒక ఫామ్ నింపి ఆధార్ - పాన్ కాపీలు, అవసరమైన ఇతర డాక్యుమెంట్లు జత చేయాలి. అక్కడ మీ బయోమెట్రిక్ డేటా తీసుకుని లింక్ చేస్తారు.

 
మీ వివరాలు ఆధార్‌లో సరిగానే ఉండి పాన్ కార్డులో తప్పుగా ఉంటే NSDL వెబ్‌సైట్‌ ద్వారా మార్చుకోవచ్చు. ఆధార్‌ కార్డులో పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్ మార్చుకోవాలంటే మాత్రం సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లక తప్పదు. ప్రస్తుతం ఆధార్ వెబ్‌సైట్‌‌లో అడ్రస్ మాత్రమే మార్చుకునే అవకాశం ఉంది.