నన్నయ విశ్వవిద్యాలయంలో లైంగిక వేధింపుల ఆరోపణలు, సీఎం జగన్‌కు లేఖ, ప్రొఫెస‌ర్ సస్పెన్షన్

students
బిబిసి| Last Modified గురువారం, 17 అక్టోబరు 2019 (14:18 IST)
ఆదిక‌వి న‌న్న‌య విశ్వవిద్యాలయంలో లైంగిక వేధింపుల వివాదం ముదురుతోంది. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ప్రొఫెస‌ర్‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ఆందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి. తాజాగా ఇంగ్లిష్ విభాగంలో ప్రొఫెస‌ర్‌గా ఉన్న సూర్య రాఘ‌వేంద్రను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు విశ్వవిద్యాలయం ఉపకులపతి (వైస్ చాన్స్‌లర్) ప్ర‌క‌టించారు. ఈ కేసుపై సమగ్ర విచార‌ణ జరపాలని మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.

సీఎంకు లేఖతో వెలుగులోకి
రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ఉన్న ఆదిక‌వి న‌న్న‌య యూనివ‌ర్సిటీని పదేళ్ల క్రితం ప్రారంభించారు. నాటి నుంచి ఈ క్యాంప‌స్ చుట్టూ అనేక వివాదాలు అల‌ముకున్నాయి. ఇప్పుడు లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు రావ‌డం కలకలం సృష్టించింది. ఇంగ్లిష్ విభాగానికి అధిప‌తిగా ఉన్న సూర్య రాఘ‌వేంద్ర అనే ప్రొఫెస‌ర్ విద్యార్థినుల‌కు అభ్యంత‌ర‌కరమైన సందేశాలు పంపించ‌డం, త‌న ఫ్లాట్‌కి ర‌మ్మంటూ వారిని బ‌ల‌వంతం చేయ‌డం వంటి ఆరోప‌ణ‌లు నేరుగా ముఖ్య‌మంత్రి దృష్టికి వెళ్లాయి.

Jagan
ముగ్గ‌ురు విద్యార్థినులు ఈ మేర‌కు సీఎంకు లేఖ రాశారు. ఇలాంటి చ‌ర్య‌ల‌ను అడ్డుకోవాల‌ని కోరారు. వీసీగా ఉన్న సురేష్ వ‌ర్మ‌, ఇంగ్లీష్ ప్రొఫెస‌ర్ మిత్రులు కావ‌డంతో త‌మ‌కు న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని వారు లేఖ‌లో ఆరోపించారు. యూనివ‌ర్సిటీ విద్యార్థుల‌పై ప్రొఫెస‌ర్ లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డుతున్నార‌నే ఆరోప‌ణ‌లపై సీఎం విచార‌ణ‌కు ఆదేశించారు. దాంతో ద‌స‌రా సెల‌వుల స‌మ‌యంలో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. విచార‌ణ చేసి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఇన్‌ఛార్జ్ వీసీగా ఉన్న సురేష్ వ‌ర్మ చెప్పారు.

ప్రొఫెసర్‌ను కాపాడుతున్నారంటూ ఆందోళన
ముఖ్య‌మంత్రి ఆదేశాల త‌ర్వాత కూడా క్యాంప‌స్‌‌లో జ‌రుగుతున్న వ్య‌వ‌హారాల‌పై ఇన్‌ఛార్జ్ వీసీ సరైన చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌నే ఆరోపణలూ వస్తున్నాయి. సెల‌వుల త‌ర్వాత సోమ‌వారం తిరిగి క్లాసులు ప్రారంభం కాగానే పలువురు మహిళా నేతలు ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ ఆందోళనలో వైసీపీ నేత‌ జ‌క్కంపూడి విజ‌య‌ల‌క్ష్మి కూడా పాల్గొన్నారు.

ఆమె బీబీసీతో మాట్లాడుతూ... "త‌ల్లిదండ్రుల త‌ర్వాత గురువులే విద్యార్థుల జీవితంలో కీల‌కం. అలాంటి వారి మీద ఆరోప‌ణలు వ‌చ్చిన‌ప్పుడు స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేసి చ‌ర్య‌లు తీసుకోవాలి. ముఖ్య‌మంత్రి కూడా ఈ యూనివ‌ర్సిటీలో వ్య‌వ‌హారాల‌పై దృష్టి పెట్టారు. అయినా, ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వ్య‌క్తిని విధుల్లో కొన‌సాగిస్తుంటే విచార‌ణ ఎలా సాధ్యం అవుతుంది. స‌స్ఫెండ్ చేయాల్సిందే. పూర్తిగా విచార‌ణ చేసి బాధ్య‌ులంద‌రి మీద చ‌ర్య‌లు తీసుకోవాల్సిందే" అని డిమాండ్ చేశారు. ఆందోళ‌నలు తీవ్రం కావ‌డం, సెల‌వుల త‌ర్వాత తొలిరోజే క్యాంప‌స్‌లో వేడి రాజుకోవ‌డంతో చివ‌ర‌కు ప్రొఫెస‌ర్‌ని స‌స్పెండ్ చేస్తున్న‌ట్టు వీసీ సోమవారం సాయంత్రం ప్ర‌క‌టించారు.
nannayya university
ఫిర్యాదుదారులు ఏమంటున్నారు, వీసీ ఏం చేశారు?
విద్యార్థుల ఫిర్యాదుపై విచార‌ణ విష‌యంలో ప‌లువురు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేసిన ముగ్గురు విద్యార్థినుల్లో ఒక‌రు ఇప్ప‌టికే కోర్సు పూర్తి చేసిన విద్యార్థి కాగా, మ‌రో ఇద్ద‌రు త‌ర‌గ‌తుల‌కు కూడా దూరంగా ఉంటున్నారు. అయితే, అధికారులు పిలిస్తే విచార‌ణ‌కు మాత్ర‌మే హాజ‌ర‌వుతామ‌ని వారిలో ఒక‌రు బీబీసీతో చెప్పారు.

ఫిర్యాదుపై సీఎం విచార‌ణ‌కు ఆదేశించ‌గానే క్యాంప‌స్‌లోని అంత‌ర్గ‌త క‌మిటీ ఆధ్వ‌ర్యంలో విచార‌ణ ప్రారంభించిన‌ట్టు వీసీ సురేష్ వ‌ర్మ బీబీసీకి తెలిపారు. "ఇలాంటి చ‌ర్య‌ల‌ను ఉపేక్షించం. ఇప్ప‌టికే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ప్రొఫెస‌ర్‌ను సస్పెండ్ చేశాం. విచార‌ణ జ‌రిగినంత కాలం ఇది అమ‌లులో ఉంటుంది. విచార‌ణ‌కు పిలిచిన‌ప్పుడు హాజ‌రుకావాల‌ని ఆదేశించాం. అప్ప‌టి వ‌ర‌కూ హెడ్ క్వార్ట‌ర్స్ వ‌దిలి వెళ్ల‌కూడ‌ద‌ని ఉత్త‌ర్వులు కూడా ఇచ్చాం. క‌మిటీ నివేదిక ఆధారంగా తదుపరి చ‌ర్య‌లు ఉంటాయి" అని వీసీ వివరించారు.

అయితే, పేరుకే అంతర్గత కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు కానీ, విద్యార్థులు ధైర్యంగా వెళ్లి తమ సమస్యలను ఆ కమిటీకి విన్నవించుకునే పరిస్థితి ఉండటంలేదని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. "విశ్వవిద్యాలయం అంటే పుస్తకాలలో ఉన్నది చెప్పడం మాత్రమే కాదు, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాల్సిన ప్రదేశం అది. విశ్వవిద్యాలయాల్లో సమూల ప్రక్షాళన జరగాలి. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్‌ను తక్షణమే అరెస్టు చేసి, విశ్వవిద్యాలయంలో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా విద్యార్థులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది" అని వాసిరెడ్డి పద్మ చెప్పారు.

ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నవారే విచారిస్తారా?
బాధితులు తమ ఫిర్యాదులో ప్రొఫెస‌ర్‌తో పాటు, వీసీ పేరును కూడా ప్ర‌స్తావించారు, అలాంట‌ప్పుడు వీసీ ఆధ్వ‌ర్యంలో సాగుతున్న విచార‌ణలో వాస్త‌వాలు ఎలా వెలుగులోకి వ‌స్తాయ‌ని ఏపీ సీ‌ఎల్‌ఏ రాష్ట్ర అధ్య‌క్షుడు, బార్ కౌన్సిల్ స‌భ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు ప్ర‌శ్నిస్తున్నారు.


"ఆరోప‌ణ‌లు యూనివ‌ర్సిటీ ప్ర‌తిష్ట దెబ్బ‌తీయ‌డం కోస‌మేన‌ని ఇప్ప‌టికే వీసీ అన్నారు. అలాంట‌ప్పుడు ఆయన ఆధ్వర్యంలో జరిగే విచార‌ణలో ఇంకేం తేలుస్తారు? గ‌తంలోనూ క్యాంప‌స్‌లో ఇలాంటివి జ‌రిగాయి. లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లతో ఒక‌రిని డిస్మిస్ కూడా చేశారు. అయినా ఇప్పుడు ఫిర్యాదుదారులు ఇంగ్లీష్ ప్రొఫెస‌ర్ మీద ముఖ్యమంత్రికి రాసిన లేఖ‌లో వీసీ తీరుపై కూడా ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వీసీ, ప్రొఫెస‌ర్ స‌న్నిహితులు కావ‌డంతో త‌మ‌కు న్యాయం జ‌ర‌గుతుంద‌నే న‌మ్మ‌కం లేద‌ని వారు ముఖ్య‌మంత్రికి రాసిన లేఖ‌లో పేర్కొన్నారు. ఇప్పుడు విచార‌ణ‌కు కూడా విద్యార్థులు రాక‌పోవ‌డానికి అదే కార‌ణం. అందుకే వాస్త‌వాలు బ‌య‌ట‌కు రావాలంటే ఉన్నత స్థాయి అధికారులతో విచార‌ణ చేయించాలి" అని సుబ్బారావు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

గ‌తంలో ఏం జ‌రిగింది?
నన్న‌య విశ్వవిద్యాలయంలో అన‌ర్హుల‌కు పోస్టులు కేటాయించారన్న ఆరోపణలు గతంలో వివాదాస్పదమయ్యాయి. ఆ వ్య‌వ‌హారం గ‌వ‌ర్న‌ర్ దృష్టికి కూడా వెళ్లింది. చివ‌ర‌కు ప్ర‌స్తుతం వీసీగా ఉన్న సురేష్ వ‌ర్మ నియామ‌కం చెల్ల‌ద‌ని ఫిర్యాదులు వ‌చ్చాయి. 2012 నుంచి 2017 వ‌ర‌కూ వివిధ క‌మిటీల రిపోర్టుల ప్ర‌కారం కంప్యూట‌ర్ సైన్స్ విభాగ అధిప‌తిగా సురేష్ వ‌ర్మ నియామ‌కం చెల్ల‌ద‌ని యూనివ‌ర్సిటీ రిజిస్ట్రార్ ఆదేశాలు కూడా ఇచ్చారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న విధుల్లో కొన‌సాగుతున్నారు. పైగా ప్ర‌స్తుతం ఇన్‌ఛార్జ్ వీసీగా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న‌తో పాటుగా ప‌లువురు ఆధ్యాప‌కుల నియామ‌కాల‌లో అన‌ర్హుల‌ను ఎంపిక చేయ‌డంపై వ‌చ్చిన అభ్యంత‌రాల‌పై విచార‌ణ క‌మిటీలు ఆధారాలను సైతం బయటపెట్టాయి. అయినా, ఆయన మీద చ‌ర్య‌లు తీసుకున్న దాఖ‌లాలు లేవు.

తనపై వచ్చిన ఆరోప‌ణ‌లు అవాస్తవమని వీసీ సురేష్ వ‌ర్మ అంటున్నారు. కొంద‌రు ఉద్దేశ‌పూర్వ‌కంగా ఆరోపణలు చేస్తున్నా, తాము మాత్రం నిష్పాక్షికంగా విచార‌ణ చేస్తున్నామ‌న్నారు. వాస్త‌వాలు వెలుగులోకి తీసుకొస్తామ‌ని, బాధితుల‌కు అండ‌గా ఉంటామని చెబుతున్నారు.

దీనిపై మరింత చదవండి :