బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 9 అక్టోబరు 2024 (18:30 IST)

సడెన్‌గా ఉద్యోగం పోతే ఏం చేయాలి, ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏమిటి?

computers
హైదరాబాద్‌కు చెందిన గణేష్ ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో ఉన్నతోద్యోగి. సుమారు 15 ఏళ్లుగా అదే కంపెనీలో పనిచేస్తూ మేనేజర్‌ స్థాయికి ఎదిగారు. ఏటా సుమారు రూ.30 లక్షల వరకూ ప్యాకేజీ ఉంది. పెళ్లి, పిల్లలు, చదువులు, లైఫ్‌స్టైల్‌లో మార్పులు వచ్చాయి. ఒక విల్లా, కారు, సిటీ శివారులో ప్లాట్.. వీటన్నింటికి అయ్యే ఖర్చులు, ఈఎంఐలకు నెలకు సుమారు రూ.2 లక్షల వరకూ చెల్లిస్తున్నారు. అంతా హాయిగా సాగిపోతోందనుకున్న గణేష్‌కు ఈ మధ్యే తను పనిచేస్తున్న ఐటీ కంపెనీ ఓ చేదు వార్త వినిపించింది.
 
టీమ్‌ సైజ్‌ను తగ్గించుకోవాలనుకుంటున్నట్లు, ఉద్యోగానికి రాజీనామా చేయాలని చెప్పేసింది. ఈ సడన్‌ షాక్‌ నుంచి తాను తేరుకుని, తన ఫ్యామిలీకి చెప్పి, వాళ్లను కూడా సెట్‌ చేయడానికి ఆయనకు చాలా కాలమే పట్టింది. ఇది ఒక్క గణేష్‌కే కాదు, ఈ మధ్య అనేక కంపెనీల్లో ఎంతో మంది ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జాబ్‌ పోయిందని ఇంట్లో చెప్పేందుకు ధైర్యం లేక కొంతమంది కొత్త ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు.
 
పింక్ స్లిప్పుల భయం
టెక్నాలజీ ఇండస్ట్రీ కరోనా తర్వాత ఒడిదుడుకులకు లోనైంది. ఒకవైపు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మరోవైపు రెసిషన్‌ భయాలతో కంపెనీలు కాస్ట్‌ కటింగ్‌కు దిగాయి. ఐబీఎం, సిస్కో, మైక్రోసాఫ్ట్‌, గూగుల్, యాపిల్‌‌ వంటి ప్రధాన కంపెనీలు కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు పింక్ స్లిప్పులు ఇచ్చేశాయి. ఈ ఏడాది అర్థ భాగంలోనే సుమారు లక్ష ఉద్యోగాల వరకూ పోయినట్టు అంచనా. 2023తో పోలిస్తే ఈసారి ఐటీ కంపెనీలు సుమారు 15 శాతం అధికంగా లే ఆఫ్‌ ప్రకటించాయి. layoffs.fyi సంస్థ చెబుతున్న డేటా ప్రకారం ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,150 టెక్‌ కంపెనీలు 2.6 లక్షల ఉద్యోగులను ఇంటికి పంపేశాయి. అధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చు.
 
జీతాలు తగ్గించేస్తున్నారు
ప్రముఖ కంపెనీలు తమ వర్క్ ఫోర్స్‌ను తగ్గించుకుంటున్నంత మాత్రాన ఐటీ ఇండస్ట్రీ పనైపోయిందని భావించాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. సర్వైవల్‌ ఆఫ్‌ ది ఫిట్టెస్ట్‌ అనే సూత్రానికి తగ్గట్టు బెస్ట్ ఆఫ్‌ ది బెస్ట్‌ మాత్రమే అంటే… మల్టీటాస్కింగ్‌, మల్టీ టాలెంట్ ఉన్న వాళ్లే ఇండస్ట్రీలో ఉండగలుగుతున్నారు. సీనియర్లకు ఉద్వాసన చెప్పి, వాళ్లకు ఇచ్చే జీతాల్లో 5-10 శాతానికి దొరికే జూనియర్ల వైపు కంపెనీలు ఎక్కువగా మొగ్గుచూపిస్తున్నాయి. ఇండస్ట్రీ లెక్కల ప్రకారం ఈ ఏడాది సుమారు లక్షన్నర వరకూ కొత్త ఉద్యోగుల నియామకం జరిగింది. ఇండస్ట్రీ ట్రెండ్‌ ఇలా ఉంది కాబట్టి, మనల్ని మనం ఎప్పటికప్పుడు ఆర్థికంగా సంసిద్ధంగా ఉంచుకోవడం ఒకటే మన చేతుల్లో ఉంది.
 
ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ ఎలా ఉండాలి?
1. ఎమర్జెన్సీ ఫండ్‌:
పర్సనల్‌ ఫైనాన్స్‌లో తొలిసూత్రం ఇది. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే మనల్ని, మన కుటుంబాన్ని చూసుకునేందుకు ఈ ఫండ్‌ ఎంతగానో ఉపకరిస్తుంది. పూర్తిగా శాలరీపైనే ఆధారపడినప్పుడు కనీసం ఆరు నెలల జీతానికి సరిపడేంత డబ్బు ఈ ఫండ్‌లో ఉండాలి. అంటే మీ జీతం రూ.50 వేలు అయితే, కనీసం రూ.3 లక్షలను మీరు ఎమర్జెన్సీ ఫండ్‌గా ఉంచుకోవాలి. ఉద్యోగం పోవడం, ఏదైనా యాక్సిడెంట్‌లో తీవ్ర గాయాలు, తీవ్ర అనారోగ్యం వంటి సమయాల్లో ఇది ఉపయుక్తంగా ఉంటుంది. ఇదీ కుదరదంటే కనీసం మీరు నెలనెలా చెల్లించాల్సిన ఈఎంఐలు, ఇంటి ఖర్చులు, అద్దె, స్కూల్‌ ఫీజుల వరకైనా కచ్చితంగా మీరు అందుబాటులో ఉంచుకోకపోతే ఇబ్బంది పడటం ఖాయం. అయితే ఈ ఎమర్జెన్సీ ఫండ్‌ను షేర్లలోనూ, రియల్‌ ఎస్టేట్‌లోనూ పెట్టుబడి పెట్టడంలా కాకుండా, మీకు అవసరమైనప్పుడు వెంటనే తీసుకునేలా బ్యాంక్‌ ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌, లిక్విడ్‌ ఫండ్స్‌, గోల్డ్ ఈటీఎఫ్స్‌ వంటి వాటిల్లో పెట్టేలా ప్లాన్‌ చేసుకోండి.
 
2. సేవ్‌ ఫస్ట్‌:
ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌లో ఇంకా ముఖ్యమైనవి రిటైర్మెంట్‌ ఫండ్‌, క్యాష్‌ ఫ్లో, సేవింగ్స్‌. వారెన్‌ బఫెట్‌ వంటి ప్రముఖులు కూడా మొదట ఉద్యోగులకు చెప్పే సూత్రం, సేవ్‌ ఫస్ట్‌. మనకు వచ్చిన జీతంలో సాధారణంగా ఖర్చులన్నీ పోగా, మిగిలిన కొద్దో గొప్పో మొత్తాన్ని పొదుపు చేయాలని అనుకుంటాం. కానీ ఇది కుదిరే పని కాదని మనకూ తెలుసు. అయినప్పటికీ మన జీతంలో కనీసం 20 శాతమైనా రేపటి కోసం మనం పొదుపు చేసుకోలేకపోతే చాలా కష్టం. మీ జీతం నెలకు రూ.50 వేలు ఉంటే, కనీసం నెలకు రూ.10 వేలు అయినా సేవ్‌ చేసే ప్రయత్నం చేయండి. ఇది మీ పెళ్లి, పిల్లల చదువు, కొత్త ఇంటి డౌన్‌ పేమెంట్‌, రిటైర్మెంట్‌ ఫండ్‌.. ఇలా దేనికైనా అక్కరకు వస్తుంది. మనకు వచ్చే జీతంలో 50 శాతం కచ్చితమైన అవసరాలకు (ఇంటి ఈఎంఐ, ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు వంటివి), 30 శాతం లగ్జరీలకు (సినిమాలు, షికార్లు, వెకేషన్‌, కొత్త వస్తువుల కొనుగోళ్లు వంటివి), మిగిలిన 20 శాతం ఫ్యూచర్ సేవింగ్స్‌ కోసం దాచిపెట్టాలి.
 
3. అప్పులు తగ్గించుకోండి:
క్రెడిట్‌ కార్డ్‌ లోన్స్‌, పర్సనల్‌ లోన్స్‌, యాప్‌ బేస్డ్‌ ఈజీ లోన్స్‌కు దూరంగా ఉండండి. అప్పు అవసరం నిజంగా ఉందా అనే దానిపై క్లారిటీ తెచ్చుకోండి. అత్యవసరమైతే తప్ప అత్యధిక వడ్డీ రుణాల జోలికి పోవద్దు. బయట మార్కెట్లో ఉన్న రెండు, మూడు రూపాయల వడ్డీ జోలికి అస్సలు పోవద్దు. మరీ తప్పదు అనుకున్నప్పుడు ప్రభుత్వ బ్యాంకుల్లోనో, కో ఆపరేటివ్‌ బ్యాంకుల్లోనో గోల్డ్‌ లోన్‌ తీసుకోండి. దీనికి నెలనెలా ఈఎంఐలా కాకుండా వడ్డీ మాత్రమే కడితే సరిపోతుంది. మీకు మనీ అడ్జస్ట్‌ అయినప్పుడు లోన్‌ క్లియర్‌ చేసి గోల్డ్‌ తెచ్చేసుకోండి. క్రెడిట్‌ కార్డులో బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌, మినిమం పేమెంట్‌, ఈఎంఐ కన్వర్షన్‌ పేరుతో వచ్చే ఆఫర్లకు కాస్త దూరంగా ఉండండి.
 
4. ఈఎంఐలు 30 శాతం దాటొద్దు
బ్యాంకులు మీకు హౌసింగ్ లేదా కారు లోన్‌ ఇచ్చేటప్పుడు చూసే ఫస్ట్‌ పాయింట్‌ ఇదే. మీకు రూ.50 వేల జీతం వస్తూ ఉంటే, అందులో గరిష్ఠంగా ఈఎంఐల రూపంలో రూ.15 వేలకు మించకుండా చూసుకోవడం బెటర్‌. హౌసింగ్‌ లోన్‌, కారులోన్‌, పర్సనల్‌ లోన్‌.. ఇలా ఎన్ని ఉన్నా మీ నెలవారీ జీతంలో ముప్ఫై శాతానికి మించకూడదు అనేది బేసిక్‌ సూత్రం. మిగిలిన డబ్బు మీ రెగ్యులర్‌ ఇంటి అవసరాలకు, సేవింగ్స్‌, బఫర్‌మనీకోసం ప్లాన్‌ చేసుకోండి.
 
5. ఇన్‌ఫ్లేషన్‌‌ను బీట్‌ చేసే రిటర్న్‌ కావాలి
భారత్‌లో ప్రస్తుతం ద్రవ్యోల్బణం (ఇన్‌ఫ్లేషన్‌) నాలుగు శాతం వరకు ఉంది. అయితే ఫుడ్‌ ఇన్‌ఫ్లేషన్‌, ఎడ్యుకేషన్‌ ఇన్‌ఫ్లేషన్‌, హెల్త్‌ ఇన్‌ఫ్లేషన్‌ పది శాతానికి పైగానే ఉంటుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. అందుకే మనం పొదుపు చేసే డబ్బు ఏదైనా ఈ ద్రవ్యోల్బణాన్ని బీట్‌ చేసే రిటర్న్స్‌ ఇచ్చేదై ఉండాలి. అదే రియల్‌ రేట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌. ఇప్పుడు బ్యాంకులు 8 శాతం వడ్డీ ఇస్తున్నాయని అనుకుందాం. 4 శాతం ఇన్‌ఫ్లేషన్‌ను తీసేయగా మనకు వచ్చే నిజమైన వడ్డీ 4 శాతం మాత్రమే. అందుకే పోర్ట్‌ఫోలియోలో మనం ఈక్విటీ మార్కెట్లను భాగం చేసుకోవాలి.
 
6. స్టాక్స్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌, గోల్డ్‌ వైపు ఆలోచించండి
ఫిక్స్‌డ్ డిపాజిట్ల వంటి వాటిల్లో గరిష్టంగా వచ్చే రిటర్న్స్‌ తక్కువ. అందుకే మన పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీలను లాంగ్‌ టర్మ్‌ కోసం కచ్చితంగా భాగం చేసుకోవాలి. మీ వయస్సు 40 ఏళ్లు అనుకుందాం. అప్పుడు... 100 మైనస్‌ 40 అంటే 60. మీరు పెట్టుబడి పెట్టే రూ.100లో రూ.60ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయొచ్చు అనేది ఓ థంబ్‌ రూల్‌. ఈక్విటీలో మ్యూచువల్‌ ఫండ్స్‌, స్టాక్స్‌ వంటివి ఇన్వెస్ట్‌మెంట్‌ కోసమే చేయాలి. ట్రేడింగ్‌ వంటి వాటి గురించి అవగాహన లేకపోతే వాటి జోలికి వెళ్లి చేతులు కాల్చుకోవద్దు. గోల్డ్‌ను కూడా మీ పోర్ట్‌ఫోలియోలో ఉంచుకోండి. మీ ఇన్వెస్ట్‌మెంట్‌లో కనీసం ఐదు నుంచి పది శాతం గోల్డ్‌కు కేటాయించండి.
 
7. ట్యాక్స్ ప్లానింగ్‌
ఆదాయపు పన్ను తగ్గించుకోవాలనే లక్ష్యంతో అవసరం లేకపోయినా పెట్టుబడులు పెట్టొద్దు. మొత్తం ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌లో ట్యాక్స్‌ ప్లానింగ్‌ ఒక భాగం మాత్రమే. కేవలం పన్ను తగ్గించుకోవాలి అనే ఆరాటంలో ఐదు నుంచి పదేళ్ల లాకిన్‌ పీరియడ్స్‌లో (ఈఎల్‌ఎస్‌ఎస్‌, ట్యాక్స్‌ సేవింగ్‌ బాండ్స్, ఎన్‌పీఎస్‌, యులిప్స్‌‌) డబ్బును ఇరికించొద్దు. గరిష్ఠ ట్యాక్స్‌ శ్లాబుల దగ్గర ఉన్నప్పుడు మరింత పర్ఫెక్ట్ ప్లానింగ్‌ అవసరం.
 
8. మీపై మీరు ఇన్వెస్ట్‌ చేసుకోండి
ఇండస్ట్రీ స్టాండర్డ్స్‌కు తగ్గట్టు మనల్ని మనం ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి. దీనికోసం అవసరమైతే కొత్త కోర్సుల్లో చేరడం, కొత్త సబ్జెక్ట్స్‌ నేర్చుకోవడం, లాంగ్వేజ్‌ డెవలప్‌ చేసుకోవడం వంటివి తప్పకుండా చేయండి. ఈ మధ్య వివిధ యూనివర్సిటీలు ఆన్‌లైన్‌ కోర్సులను అందిస్తున్నాయి. వేరే ఇండస్ట్రీలోకో, ఉద్యోగంలోకో,వ్యాపారంలోకో అడుగుపెట్టే యోచన ఉన్నప్పుడు అందుకు అవసరమైన సబ్జెక్ట్‌ నేర్చుకోండి. ఇండస్ట్రీలో వస్తున్న మార్పులను తెలుసుకుని ముందే జాగ్రత్త పడాలి.
 
9. టర్మ్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్
పైన చెప్పినవి ఎన్ని మాట్లాడుకున్నా ముందుగా మనం తీసుకోవాల్సింది టర్మ్‌ ఇన్సూరెన్స్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌. ఎటూ మీరు చేసే కంపెనీ ఆరోగ్య బీమా ఇస్తుంది. అది సరిపోతుందో లేదో చూసుకుని, అవసరమైతే టాప్‌ అప్‌ తీసుకోండి. ఇక జీవిత బీమా చాలా ముఖ్యం. అందుకే తక్కువ ధరలో అందుబాటులో ఉన్న టర్మ్‌ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోండి. మీ వార్షికవేతనానికి కనీసం పదిరెట్లు తక్కువ లేకుండా బీమా తీసుకోండి. అంటే మీ వార్షిక వేతనం రూ.6 లక్షలు ఉంటే, కనీసం రూ.60 లక్షలకు తగ్గకుండా టర్మ్‌ కవర్‌ తీసుకోండి.
 
10. ఒకరోజు ఆగి నిర్ణయం తీసుకోండి
దసరా, దీపావళి, క్రిస్మస్‌, న్యూ ఇయర్‌… ఇక ఇక్కడి నుంచి అన్నీ ఆఫర్ల సీజన్‌. మీకు అవసరం ఉన్నా లేకపోయినా మిమ్మల్ని టెంప్ట్‌ చేసే ఆఫర్లు మీ ఫోన్‌ ఓపెన్‌ చేయగానే రెడీగా ఉంటాయి. వాటిని చూసి తొందర పడొద్దు. ఏదైనా కొని తీరాలి అనుకున్నప్పుడు, 24 గంటలు సమయం తీసుకోండి. అప్పుడు కూడా మీకు అది కచ్చితంగా కావాలి అనిపిస్తేనే తీసుకోండి. చాలా కంపెనీల్లో ఇది బోనస్‌లు ఇచ్చే సమయం. ఆ డబ్బులో కనీసం 60 శాతం వరకైనా ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం ఉపయోగించేలా ప్లాన్‌ చేసుకోండి. మిగిలిన మొత్తాన్ని మీ సరదాలు, అవసరాలు తీర్చుకునేందుకు ఉపయోగించవచ్చు.
 
ఇలా ప్లానింగ్‌ చేసుకుంటే, ఏదైనా అనిశ్చితి ఉన్నప్పుడు త్వరగా బయట పడటానికి, వేగంగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుల్లో ఉండి, ఫ్యూచర్‌ ఏంటో తెలియని అగమ్యగోచర స్థితిలో ఉన్నప్పుడు ఉద్యోగం కూడా ఇబ్బందుల్లో పడితే సమస్య మరింత తీవ్రమవుతుంది. అందుకే ప్రతిదీ పద్ధతి ప్రకారం ఖర్చుచేస్తే సమస్యలు ఎదురైనప్పుడు నిబ్బరంగా ఉండొచ్చు. మిమ్మల్ని కష్టకాలంలో నిలబెట్టేది మీ ఫైనాన్షియల్ ప్లానింగే. మీ జీతాన్ని బట్టి ఖర్చులు పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటే పింక్ స్లిప్‌లాంటి భయాలు వెంటాడుతున్నా కొంచెం ధైర్యంగా ఉండొచ్చు.