శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : సోమవారం, 29 అక్టోబరు 2018 (13:08 IST)

ఫోటోల్లో మేకప్ చెదరకుండా వుండాలంటే?

పెళ్లి కుమార్తెగా చక్కగా ముస్తాబయ్యాం. కానీ... ఫోటోలు తీసేటప్పుడు మేకప్ చెదిరిపోతే ఎలా అని భయపడేవారైతే ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుందని బ్యూటీషియన్లు అంటున్నారు. మేకప్ వేసుకునేటప్పుడు బాగా వెలుతురు పడేచోటే మేకప్‌ వేసుకోవాలి. గదిలో బల్బుల వెలుతురు కింద కాకుండా సహజ వెలుతురు ఉండేలా చూసుకోవాలి. దానివల్ల ముఖంపై ఐషాడో, లేదంటే లైనర్‌ వంటివేమైనా అంటుకున్నా స్పష్టంగా కనిపిస్తుంది. పైగా మస్కారా, లిప్‌లైనర్‌ లాంటివి సరిగ్గా పెట్టుకున్నామా లేదా అని సులభంగా తెలుస్తుంది. 
 
ఫౌండేషన్‌ రాసుకున్నప్పుడు ఎక్కువగా ముఖం మధ్యభాగం మీదే శ్రద్ధ పెడతాం. అలా కాకుండా ముఖం అంచుల వరకూ రాసుకునేలా చూసుకోవాలి. మెడకు కూడా నప్పే ఫౌండేషన్‌ రాసుకోవడం తప్పనిసరి. అలాగే ఫౌండేషన్‌, పౌడర్‌ జుట్టుకు అంటుకోకుండా జాగ్రత్త పడాలి. లేదంటే ఫొటోల్లో అది స్పష్టంగా కనిపిస్తుంది. 
 
ఇంకా షిమ్మర్‌, హైలైటర్‌ లాంటివి వీలైనంత తక్కువగా వాడాలి. లేదంటే కెమెరా ఫ్లాష్‌ వల్ల ముఖం జిడ్డుతో మెరిసినట్టు కనిపిస్తుంది. ఎక్కువగా మ్యాటీ లేదంటే లైట్‌వెయిట్‌ మేకప్‌లకే ప్రాధాన్యం ఇవ్వాలి. ఐషాడోలు, ఐలైనర్‌లు ఎంచుకుంటున్నప్పుడూ వాటిలో మెరిసే వాటి జోలికి పోకూడదు. 
 
ఒకవేళ హైలైటర్‌, బ్రాంజర్‌ లాంటి వాటికి మామూలుగా రౌండెడ్‌ బ్రష్‌ కన్నా ఫ్యాన్‌ బ్రష్‌ వాడటం మంచిది. దానివల్ల ముఖమంతా సమంగా అంటుకుంటుంది. వీలైతే ఫౌండేషన్‌, పౌడర్‌ రాసుకుంటున్నప్పుడు కూడా దీన్నే వాడితే మేలు. ఇలా చేస్తే మేకప్ చెదిరిపోకుండా.. ఫోటోలకు చక్కగా కుదురుతుందని బ్యూటీషియన్లు చెప్తున్నారు.
 
అలంకరణ చేసుకునే ముందు ఎటువంటి దుస్తులు వేసుకోవాలనే స్పష్టత ఉండాలి. అప్పుడే వాటికి తగినట్లుగా అలంకరణ చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కళ్లకింద నల్లని వలయాలు, మొటిమల మచ్చలు మీ ముఖంపై ఉంటే... కన్సీలర్‌ని తప్పనిసరిగా వాడాలి. అయితే అది ముఖ చర్మానికి నప్పేదై ఉండాలి. 
 
ముఖానికే కాదు... కనురెప్పలపై కూడా కొద్దిగా ఫౌండేషన్‌ అద్దుకోవాలి. తరువాత కాస్త కాజల్‌ రాసుకున్నా చాలు. పెదాలకు వీలైనంతవరకూ లేతరంగులో లిప్‌స్టిక్‌ వేసుకుంటే బాగుంటుంది. దుస్తులకు తగినట్లుగా నగలు అలంకరించుకుంటే సరిపోతుంది. ఇలా చేస్తే ఫోటోల్లో చక్కగా కనిపిస్తారు. మేకప్ కూడా ఫోటోలకు చక్కగా నప్పుతుంది.