చల్లచల్లగా శీతాకాలం వచ్చేస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కార్తీక మాసం ముగుస్తుందనగానే చల్లటి గాలులు ప్రారంభమవుతాయి. శీతాకాలం వచ్చేస్తుంది. ఈ కాలంలో శరీరంలో మార్పులు కూడా చోటుచేసుకుంటాయి. ఈ కాలంలో శరీరం పొడిబారినట్లవుతుంది. కొందరిలో చర్మం చిట్లుతుంది. పెదవులు పగిలిపోతుంటాయి. ముఖ్యంగా మహిళలు శరీరం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి.
పొడి చర్మం కలిగిన వారైతే... రెండు టీ స్పూన్లు బాదంనూనె, రెండు టీస్పూన్ల బాదం పొడి, రెండు టీ స్పూన్లు అరటి ముక్కలు, రెండు టీస్పూన్లు గ్లిజరిన్ లేదా తేనే, నాలుగు టీ స్పూన్లు పాలు కలిపి మెత్తని గుజ్జు మాదిరి పేస్ట్ చేసి ముఖానికి, మెడకు మృదువుగా మసాజ్ చేస్తూ పట్టించి కొద్దిసేపు వుంచి కడిగేయాలి. చర్మం మృదువుగా మారుతుంది. శీతాకాలంలో అద్భుతంగా పనిచేస్తుంది. చేతులు, పాదాలకు కూడా అప్లయ్ చేయవచ్చు.
జిడ్డు చర్మం కలిగిన వారు.. రెండు టీ స్పూన్లు ఓట్‌మీల్ పొడి, నాలుగు టీ స్పూన్లు మజ్జిగ, రెండు టీ స్పూన్లు గంధం పొడి కలిపి ముఖానికి, మెడకు బాగా పట్టించి, గోరువెచ్చని నీటితో కడిగేస్తే జిడ్డు చర్మం పోయి కాంతివంతంగా ఉంటుంది.
ఇక శిరోజాల సంరక్షణకు.. ఒక కప్పు బొప్పాయి గుజ్జు, అరకప్పు కొబ్బరి క్రీమ్ లేదా పాలు, పావు కప్పు కొబ్బరినూనె, పావు కప్పు బీట్ రూట్ జ్యూస్ కలిపి పేస్టు తయారు చేసుకుని జుట్టుకు, పట్టించాలి. పదినిమిషాలాగి హెర్బల్ షాంపూతో వాష్ చేసుకోవాలి. శీతాకాలంలో ఈ ప్యాక్ జుట్టును పరిరక్షిస్తుంది. జుట్టురాలడాన్ని, చుండ్రును తగ్గిస్తుంది.