గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (11:40 IST)

"నీకిది.. నాకది" కేసులో చందా కొచ్చర్ భర్త అరెస్టు

దేశంలోని ప్రైవేట్ సెక్టార్ రంగంలో అగ్రగామిగా ఉన్న బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ మాజీ సీఈవో చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. ఈయనను మనీలాండరింగ్ కేసు(క్విడ్ ప్రొకో)లో అదుపులోకి తీసుకుంది. 
 
వీడియోకాన్‌ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్‌ రుణాలిచ్చిన కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలకు సంబంధించి సోమవారం మధ్యాహ్నం నుంచి ఆయనను ప్రశ్నించిన ఈడీ.. సోమవారం రాత్రి అరెస్టు చేసినట్టు ప్రకటించింది. 
 
వేణుగోపాల్‌ ధూత్‌కు చెందిన వీడియోకాన్‌ గ్రూప్‌నకు చందా కొచ్చర్‌ హయాంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.1,875 కోట్ల మేర రుణాలిచ్చింది. ఈ వ్యవహారంలో ధూత్‌, కొచ్చర్‌ల మధ్య క్విడ్‌ప్రోకో (నీకిది.. నాకది) జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. 
 
దీనిపై కేసు నమోదు చేసిన ఈడీ విచారణ చేపట్టింది. కాగా, భారీ మొత్తంలో రుణాలు మంజూరు చేసినందుకుగాను వీడియోకాన్ సంస్థకు చెందిన లగ్జరీ ఫ్లాట్‌ను ముంబై నగరంలో చందా కొచ్చర్‌కు బహుమతిగా ఇచ్చారు.