ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 డిశెంబరు 2020 (20:35 IST)

జనవరి నుంచి ఫాస్టాగ్ ఉంటేనే టోల్‌ప్లాజాల్లో వాహనులకు ఎంట్రీ!

కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి నుంచి అన్ని వాహనాలకు ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేసింది. టోల్ ఫీజును ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించడాన్నే ఫాస్టాగ్‌గా పిలుస్తారు. దీనిద్వారా టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి ఆలస్యం లేకుండా ముందుకెళ్లవచ్చు. ఈ ఫాస్టాగ్ ఉంటేనే టోల్ ప్లాజాల వద్ద వాహనాలకు అనుమతి ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. 
 
కాగా, మన దేశంలో ఫాస్టాగ్ వ్యవస్థను దేశంలో 2016లో ప్రవేశపెట్టారు. ఈ విధానం కింద 2018 నాటికి 34 లక్షల ఫాస్టాగ్‌లు జారీ అయ్యాయి. ఈ ఏడాది నవంబరులో కేంద్రం జారీ చేసిన ఆదేశాల్లో... పాత వాహనాలకు, 2017 డిసెంబరు 1వ తేదీకి ముందు అమ్ముడైన వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది. 
 
అంతేకాదు, కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు-1989 ప్రకారం 2017 డిసెంబరు 1 నుంచి నాలుగు చక్రాల వాహనాల రిజిస్ట్రేషన్ లో ఫాస్టాగ్ ను తప్పనిసరి చేసింది. ఓ రవాణా వాహనం ఫిట్ నెస్ సర్టిఫికెట్ రెన్యువల్ చేయాలన్నా ఫాస్టాగ్ కలిగివుండాలన్న నిబంధన విధించారు.
 
ఈ నేపథ్యంలో 2021 జనవరి ఒకటో తేదీ నుంచి అన్ని వాహనాలకు ఫాస్టాగ్‌లు తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వాహనాలకు ఫాస్టాగ్‌లు ఉంటేనే టోల్ ప్లాజాల వద్ద అనుమతిస్తారు. 
 
దీనిపై నితిన్ గడ్కరీ ఓ వర్చువల్ కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రయాణికులకు ఫాస్టాగ్ వ్యవస్థ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, నగదు చెల్లింపుల కోసం వారు టోల్ ప్లాజాల వద్ద సమయం వృథా చేసుకోనవసరం ఉండదని వివరించారు. పైగా ఇంధనం కూడా ఆదా అవుతుందని తెలిపారు.