బంగారంపై రుణం తీసుకుని వున్నారా? అయితే ఇది తెలుసుకోండి?
వ్యక్తిగత, కుటుంబ అవసరాల కోసం అనేక మంది బ్యాంకుల్లో గోల్డ్ లోన్లు తీసుకుంటుంటారు. అయితే రుణాల వడ్డీల చెల్లింపుల్లో బ్యాంకులు కొత్త నిబంధనను తీసుకొచ్చాయి. ఇప్పటివరకు యేడాది ఆఖరులో రుణానికి వడ్డీ చెల్లించే వెసులుబాటు ఉండేది. ఇపుడు ఈ విధానానికి కొన్ని బ్యాంకులు స్వస్తి పలుకుతున్నాయి. ఇకపై ప్రతి నెలా ఠంచనుగా వడ్డీ చెల్లించాల్సిందేనంటూ షరతు విధిస్తున్నాయి. బంగారం ధరలు పెరిగిపోవడంతో రుణ ఎగవేతలు కూడా భారీగా పెరిగిపోయే అవకాశం ఉండటంతో బ్యాంకులు ఈ నిర్ణయానికి వచ్చాయి.
ఈ కొత్త నిబంధన ప్రకారం ఇకపై ప్రతి నెలా వడ్డీ చెల్లించకపోతే దాని ప్రభావం నేరుగా కస్టమర్ సిబిల్ స్కోరుపై పడుతుందని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. సిబిల్ స్కోరు తగ్గితే భవిష్యత్‌లో ఇతర ఎలాంటి రుణాలు పొందాలన్నా కష్టమవుతుంది. ఖాతాదారుడి ఆర్థిక పరిస్థితిని బట్టే ఈ నిబంధన అమలు చేస్తున్నామని బ్యాంకు అధికారులు వివరణ ఇస్తున్నారు.
దేశంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. దీంతో తక్కువ బంగారంపై ఎక్కువ రుణం పొందే అవకాశం ఉంది. ఇది ప్రజలను బాగా ఆకర్షిస్తుంది. ఇతర రుణాలతో పోలిస్తే 9 శాతం లోపు వడ్డీకే రుణం లభించడంతో గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో దేశ వ్యాప్తంగా బంగారు రుణాలు 26 శాతానికి పెరిగాయి. అయితే, రుణం తీసుకున్న వారు యేడాదిలోగా తిరిగి చెల్లించడంలో విఫలమవుతున్నారు. ఈ కారణంగానే గోల్డ్ లోన్ విభాగంలో మొండి బకాయిలు 30 శాతానికి పైగా పెరిగిపోయానని బ్యాంకింగ్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.