గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 22 జనవరి 2019 (17:27 IST)

ఇకపై ఫైనాన్షియల్ ఇయర్.. జనవరి టు డిసెంబరు

కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మార్చి నెలాఖరు వరకు కాకుండా జనవరి నుంచి డిసెంబరు వరకు పరిగణించాలని భావిస్తోంది. వ్యవసాయంతో అనుసంధానం చేసే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 
 
నీతి ఆయోగ్‌లో ముఖ్యమంత్రులతో సమావేశంలో భాగంగా జనవరి-డిసెంబర్ ఆర్థిక సంవత్సరానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆమోదం తెలిపారు. వ్యవసాయ ఆదాయం ఎంతో ముఖ్యమైన భారత్ వంటి దేశాల్లో ఆ ఆదాయం అందిన వెంటనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం అవసరం అని ప్రధాని అభిప్రాయపడ్డారు. 
 
సాధారణంగా జూన్‌లో వర్షాకాలం వస్తుంది. కానీ రాష్ట్రాలు వివిధ పథకాలు, వ్యయాలను అక్టోబర్‌కుగానీ మొదలుపెట్టలేకపోతున్నాయి. దీని వల్ల సగం యేడాది మాత్రమే పథకాల అమలు జరుగుతున్నది. అందుకే రెండేళ్ల కిందటే ఆర్థిక సంవత్సరాన్ని జనవరి ఒకటో తేదీనే మొదలయ్యేలా చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిందిగా కేంద్రం ఓ కమిటీని నియమించింది. 
 
ఈ కమిటీ ఆర్థిక సంవత్సరాన్ని మార్చడానికి గల కారణాలు, వివిధ పంటలు, వ్యాపారాలపై దాని ప్రభావం, పన్నుల వ్యవస్థలో మార్పుల్లాంటి వివిధ అంశాలపై నివేదికను తయారు చేసి కేంద్రానికి అందజేసింది. ఇప్పటికే బడ్జెట్‌ను నెల రోజుల ముందుగా ఫిబ్రవరి 1నే ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. దీంతో ఏప్రిల్ 1 నుంచి కొత్త బడ్జెట్‌ను అమలు చేసే వీలు కలుగుతున్నది. అలాగే, రైల్వే బడ్జెట్‌ను కూడా సాధారణ బడ్జెట్‌లో విలీనం చేశారు.