మండిపోతున్న మటన్, చికెన్ ధరలు..
మటన్, చికెన్ ధరలు ఆకాశాన్నంటాయి. మటన్, చికెన్ ధరలు భారీగా పెరగడంతో కొనలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.300గా ఉంది. ధరల పెరుగుదలకు పెళ్లిళ్లు కూడా ఓ కారణమని పౌల్ట్రీల యజమానులు అంటున్నారు.
ఇక బోన్ లెస్ చికెన్ ధర మటన్ రేటుతో సమానంగా ఉంది. కిలో బోన్ లెస్ చికెన్‌ను సుమారు రూ.600లకు విక్రయిస్తున్నారు. ఐదు నెలల క్రితం కిలో చికెన్ ధర రూ.80గా ఉన్నది. ఇప్పుడు రూ.300లకు పెరిగింది. అలాగే నాటు కోడి ధరలు కూడా పెరిగిపోయాయి. కిలో నాటు కోడి ధర రూ. 480గా పలుకుతోంది.
వేసవి ఎండలు విపరీతంగా ఉండటం, వేడి గాలులు వీస్తుండటంతో ఫారాల్లో కోళ్లు చనిపోతున్నాయి. ఫలితంగా కిలో చికెన్ ధర రూ. 300కు చేరింది. గడిచిన వారం రోజుల్లోనే కిలో చికెన్ ధర రూ. 50 నుంచి 60 వరకు పెరిగింది.
మరోవైపు మటన్ ధరలు కూడా మండిపోతున్నాయి. 10 రోజుల క్రితం కిలో మటన్ రూ. 750 వరకు ఉండేది. ప్రస్తుతం కిలో మటన్ ధర రూ. 800 నుంచి రూ. 850 వరకు పలుకుతుంది.