బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 జులై 2021 (08:54 IST)

ప్యాసింజర్ రైళ్లలో ఎక్స్‌ప్రెస్ చార్జీల బాదుడు... ప్రయాణికుల గగ్గోలు

తెలుగు రాష్ట్రాల్లో సుధీర్ఘకాలం తర్వాత ప్యాసింజర్ రైళ్లు సోమవారం నుంచి పట్టాలెక్కాయి. అదేసమయంలో చార్జీల బాదుడు కూడా ఆరంభమైంది. ప్యాసింజర్ రైళ్ళలో ఎక్స్‌ప్రెస్ రైళ్ళ చార్జీలను వసూలు చేస్తున్నారు. అంటే.. ఈ చార్జీల బాదుడు 50 శాతం నుంచి 200 శాతం మేరకు ఉంది. దీంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే కోవిడ్ స్పెషల్ రైళ్ళ పేరుతో రైల్వే శాఖ కనీసం రూ.15 నుంచి గరిష్టంగా రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తోది. ఇపుడు ప్యాసింజర్ రైళ్లలో కూడా బాదుడుకు శ్రీకారం చుట్టింది. ఈ పరిస్థితి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే అమలు చేస్తున్నారు. 
 
కరోనా వైరస్ కారణంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆర్థికపరంగా బాగా చితికిపోయారు. ఇలాంటి వర్గాలపై రైల్వేలు కూడా మరింత భారాన్ని మోపుతున్నాయి. కొవిడ్‌ అన్‌లాక్‌ మొదలైనప్పటి నుంచి నడిపిస్తున్న స్పెషల్‌ రైళ్ల టికెట్ల ధరలు సామాన్య ప్రయాణికుడి జేబుకు చిల్లుపెట్టేలా ఉన్నాయి. 
 
గతంలో నడిపిన ప్యాసింజర్‌ రైళ్లకే 'స్పెషల్‌ ట్రైన్స్‌'గా పేరు పెట్టి, కొన్ని స్టాప్‌లను తగ్గించి ప్రస్తుతం నడిపిస్తున్నారు. కానీ వీటి చార్జీలు మాత్రం ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల స్థాయిలో ఉండటం విమర్శలకు తావిస్తోంది. ఇలా దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో 82 స్పెషల్‌ రైళ్లు నడుపుతున్నారు. 
 
అయితే వీటికి అడ్వాన్స్‌డ్‌ రిజర్వేషన్‌ సదుపాయం లేదు. అన్ని రైళ్లను అన్‌ రిజర్వ్‌డ్‌ కేటగిరిలోనే నడుపుతున్నారు. రైలు బయలుదేరే ముందు స్టేషన్‌లోని బుకింగ్‌ కౌంటర్‌లోగాని, ఆటోమెటిక్‌ టికెట్‌ వెండింగ్‌ మిషన్‌ ద్వారా గాని టికెట్‌ తీసుకొని రైలు ఎక్కాల్సి ఉంటుంది. అయినా వీటి చార్జీలు మాత్రం ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల స్థాయిలో ఉండటం గమనార్హం.
 
ఉదాహరణకు సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి కాజీపేటకు గతంలో ప్యాసింజర్‌ రైలులో వెళ్లాలంటే చార్జీ రూ.35 ఉండేది. అదే ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కితే అన్‌ రిజర్వుడ్‌ బోగీ చార్జీ రూ.65 ఉండేది. తాజాగా అధికారులు ప్రకటించిన స్పెషల్‌ రైళ్లలో కాజీపేటకు వెళ్లాలంటే ఎక్స్‌ప్రెస్‌ రైలు స్థాయి చార్జీని (దాదాపు రూ.85) చెల్లించాల్సి వస్తోంది. అదేమంటే.. తాము ప్రస్తుతం నడుపుతున్న రైళ్లన్నీ ఎక్స్‌ప్రెస్‌లేనని, అందుకే ఎక్స్‌ప్రెస్‌ చార్జీలు వసూలు చేస్తున్నామని రైల్వే అధికారులు సమర్థించుకుంటున్నారు.