కరోనా కష్టాల్లోనూ ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా?
ప్రపంచాన్ని కరోనా వైరస్ కష్టాలు కమ్మేశాయి. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రపంచంలోని అనేక దేశాలు లాక్డౌన్‌ను అమలుచేస్తున్నాయి. ఫలితంగా ప్రతి ఒక్కరూ కాలు బయటపెట్టేందుకు వీల్లేకుండా పోయింది. లగ్జరీ జీవితాన్ని గడుపుతూ వచ్చిన అనేక మంది ఇపుడు తమతమ ఇళ్ళకే పరిమితమయ్యారు. అలాగే, ప్రతి రోజూ ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారు సైతం ఇపుడు చేతులు కట్టుకుని కూర్చున్నారు. అయితే, తాజాగా దేశంలో లాక్డౌన్ ఆంక్షలను సడలించింది. దీంతో పలువురు ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కరోనా బారిన పడకుండామనల్ని కాపాడుకోవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. తోటివారిని, ఇరుగుపొరుగువారికి ఇబ్బంది కలిగించకుండా ఉండొచ్చు.
ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారు చాలా మంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకుంటారు. ఇలాంటి వారే మరింత జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే.. డబ్బు ఇచ్చే సమయంలో డెలివరీ బాయ్‌ల ద్వారా కరోనా సోకే ప్రమాదముంది. అందువల్ల క్యాష్ ఆన్ డెలివరీ కంటే కాంటాక్ట్‌లెస్ డెలివరీని ఎంచుకోవడం ఉత్తమం.
అంటే.. మీ ఆర్డర్‌ను డోర్‌వద్ద వదిలేసి డోర్ బెల్ మోగించమని డెలివరీ బాయ్‌కి చెప్పండి. కాల్‌చేసి నిర్ధారణ చేసుకోండి. అతను వెళ్లిన తర్వాత మీ ఆర్డర్‌ను తీసుకోండి,
అలాగే, క్యాష్ ఆన్ డెలివరీకి బదులు ముందే ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించండి.. ఒకవేళ క్యాష్ ఇవ్వాల్సి వస్తే ఆర్డర్ మొత్తం ఎంతో దానికి సరిపడా చిల్లరతో సహా ఇవ్వండి.
ఆన్‌లైన్ ఆర్డర్ చేసే ముందు డెలివరీ కంపెనీల హైజీన్ రేటింగ్ చూడాలి. సురక్షితమైన పద్ధతిలో డెలివరీ చేసే కంపెనీలను మాత్రమే ఎంచుకోండి.
ఆన్‌లైన్ ద్వారా డెలివరీ తీసుకునే వస్తువులను ముందుగా ఒక కంటైనర్‌లో ఉంచండి. ముఖానికి మాస్క్ ధరించి ప్యాకింగ్‌ను విప్పండి. ప్యాకింగ్ చెత్తను వెంటనే డస్ట్‌బిన్‌లో పారేయండి. అనంతరం చేతులను సబ్బుతో కడుక్కోండి.
ప్యాకింగ్ విప్పిన తర్వాత మీ వస్తువును శానిటైజర్ స్ప్రే చేసిన గుడ్డతో శుభ్రం చేయాలి. ఆహార పదార్థాలకు ఇది వర్తించదు. ఆ తర్వాత మరోమారు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
ఆహార పదార్థాలను ఆన్‌లైన్ ద్వరా ఆర్డర్ చేయకపోవడమే మంచిది. ఒక వేళ చేస్తే డెలివరీ చేసిన ఫుడ్ వేడిగా ఉందోలేదో చూసుకోండి. లేకపోతే వేడి చేసి ఆరగించడం చాలా మంచిది.
కూరగాయలు, పండ్లు వంటి వాటిని ఆన్‌లైన్లో తెప్పించుకుంటే వాటిని కాసేపు ఉప్పునీళ్లలో ఉంచి శుభ్రం చేయాలి. ఆ తర్వాతే వాటిని వినియోగించాలి.