సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 మే 2022 (12:49 IST)

సెంచరీ కొట్టిన టమోటా: చికెన్ ధరలతో పోటీ

Tomato
టమాటా ధర అమాంతంగా ఒక్కసారిగా రూ.100కి చేరింది. గత మూడు నెలలగా భగ్గుమన్న సూర్యుడి ప్రతాపంతో టమాటా దిగుబడి భారీగా పడిపోగా.. ఇప్పుడు వేసవిలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఉన్న కాస్త పంటా దెబ్బతింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో టమాటాకి భారీ డిమాండ్ ఏర్పడింది. 
 
దీంతో పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకోవడంతో ధర అమాంతం కొండెక్కి కూర్చుంది. ఒకవైపు పెట్రోల్ ధరలు సెంచరీ దాటి పోగా.. చికెన్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పుడు పోటీగా టమాటా కూడా సెంచరీ కొట్టేసింది.
 
రైతు బజార్లు, పెద్ద పెద్ద మార్కెట్లలో మంచి టమాటాలు కిలో రూ.80 పలుకుతుంటే చిన్న చిన్న మార్కెట్లలో రూ.100కి చేరింది. సాధారణ రోజుల్లో నగరానికి 80 నుంచి 100 లారీల టమాట దిగుమతి అవుతుంటే ప్రస్తుతం రోజుకు 50 లారీల రావడం కూడా కష్టమైందని మార్కెట్ శాఖ అధికారులు చెబుతున్నారు. హొల్ సేల్ మార్కెట్‌లోనే కిలో టమాట రూ.50 నుంచి 55 పలుకుతోండగా.. మార్కెట్లలో రూ.80 నుండి రూ.100 పలుకుతుంది.
 
మరో తెలుగు రాష్ట్రమైన ఏపీలో కూడా టమాటా ధరలు కొండెక్కాయి. రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్టయిన మదనపల్లె మార్కెట్లో కిలో టమాటా రూ.60కి చేరితే ఇది వినియోగదారుల వద్దకు చేరేసరికి సెంచరీకి చేరింది.