సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 జనవరి 2022 (13:44 IST)

ఏపీలో చాపకింద నీరులా వ్యాపిస్తున్న కరోనా వైరస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చాపకింద నీరులా వ్యాపిస్తుంది. గత 24 గంటల్లో ఏకంగా 33,339 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో 547 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఈ కొత్త కేసులతో కలుపుకుంటే ప్రస్తుతం రాష్ట్రంలో 2,286 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
ఏపీలోని 13 జిల్లాల్లో మొత్తం 236 ఆస్పత్రుల్లో కరోనా వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్నారు. వీరిలో 334 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో జనరల్ వార్డుల్లో 61మంది, ఐసీయూలో 82 మంది ఉన్నారు. అలాగే, ఆక్సిజన్ సాయంతో చికిత్స పొందుతున్న వారిలో 177 మంది, వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న వారిలో 14 మంది ఉన్నారు. వీరు కాకుండా హోం ఐసోలేషన్‌లో 1952 మంది చికిత్స పొందుతున్నట్టు ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 
 
లక్ష దాటేసిన పాజిటివ్ కేసులు 
దేశంలో కరోనా వైరస్ మళ్లీ కల్లోలం సృష్టిస్తుంది. ఫలితంగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా లక్షకు పైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిజానికి దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైనప్పటి నుంచి భారీగానే కొత్త కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా, రెండు మూడు రోజులుగా కొత్త కేసులు రెట్టింపు సంఖ్యలో నమోదవుతున్నాయి. 
 
ఈ క్రమంలో శుక్రవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు గడిచిన 24 గంటల్లో పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 1,17,100గా నమోదయ్యాయి. ఈ వైరస్ సోకడం వల్ల మరో 302 మంది మృత్యువాతపడ్డారు. ఈ కొత్త కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 36,256 కేసులు నమోదయ్యాయి. 
 
ఈ కేసులతో కలుపుకుని ప్రస్తుతం దేశంలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా 3,71,363కు పెరిగాయి. అదేవిధంగా ఒమిక్రాన్ కేసుల్లో కూడా పెరుగుదల కనిపించింది. 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటివరకు మొత్తం నమోదైన ఒమిక్రాన్ కేసులు కలుపుకుంటే 2630కు చేరింది.