బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 13 జనవరి 2022 (22:52 IST)

ఆనందయ్యా ఆ మందు ఆపేయండి: ఆయుష్ ఆర్డర్

నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం గ్రామానికి చెందిన మూలికా ఔషధ నిపుణుడు ఆనందయ్యకు ఆయుష్ డిపార్టుమెంట్ షాకిచ్చింది. కోవిడ్ లేదా ఓమిక్రాన్ చికిత్స కోసం మందు పంపిణీ, సరఫరాకు సంబంధించిన అన్ని కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని నోటీసు ఇచ్చింది. లేకుంటే ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయుష్ హెచ్చరించింది.
 
 
ఆయుష్‌ కమీషనర్‌ కల్నల్‌ రాములు, ఆనందయ్య కోవిడ్‌ తయారీలో వాడుతున్న పదార్థాల వివరాలను అందించాలని కోరినప్పటికీ ఇప్పటివరకూ ఇవ్వలేదని తెలిపారు. అందువల్ల ఆ మందును తయారు చేసేందుకు లేదా పంపిణీ చేసేందుకు తమ శాఖ ఎలాంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు.

 
డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940 ప్రకారం ఏదైనా ఔషధ ఉత్పత్తికి ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. కానీ ఆనందయ్య అలాంటి అనుమతి పొందలేదన్నారు. మందు పంపిణీకి అనుమతి కోసం దరఖాస్తు కూడా సమర్పించలేదని తెలిపారు.

 
భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని కోవిడ్-సంబంధిత మందులకు అటువంటి ట్రయల్స్ తప్పనిసరి కాబట్టి, తాను నిర్వహించిన ఏవైనా క్లినికల్ ట్రయల్స్ వివరాలను సమర్పించాలని ఆనందయ్యను కోరినట్లు తెలిపారు. డ్రగ్స్ అండ్ మాజికల్ రెమెడీస్ యాక్ట్ 1954లోని సెక్షన్ 4ను ప్రస్తావిస్తూ, ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా సదరు మందు 48 గంటల్లో ఒమిక్రాన్‌ను నిర్వీర్యం చేస్తుందని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు.