మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 ఏప్రియల్ 2020 (14:09 IST)

నాగాలాండ్‌లో అడుగుపెట్టిన కరోనా.. తొలి కేసు నమోదు

ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌లోకి కరోనా వైరస్ ప్రవేశించింది. దీంతో నాగాలాండ్‌లో తొలి కరోనా కేసు నమోదైంది. ఈ విషయాన్ని అస్సాం రాష్ట్ర ఆరోగ్య మంత్రి హిమంతా బిశ్వాస్ శర్మ వెల్లడించారు. దిమాపూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన వ్యక్తిలో కరోనా లక్షణాలు కనిపించడంతో గౌహతికి నమూనాలు పంపించగా, పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ఆయన్ను అక్కడి స్థానిక వైద్య కాలేజీ ఆస్పత్రికి తరలిచి చికిత్స అందిస్తున్నారు. 
 
దిమాపూర్‌కు చెందిన సదరు పేషంట్‌ను నాగాలాండ్ ప్రభుత్వం నేరుగా సిఫార్సు చేసిందని చెప్పారు. ఇక ఇదే విషయాన్ని ఖరారు చేసిన నాగాలాండ్ ఆరోగ్య మంత్రి ఎస్ పాంగ్యూ, తొలి కేసు నమోదు కావడంతో అప్రమత్తమయ్యామని ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అతనితో కాంటాక్ట్ అయిన వారందరినీ వెంటనే క్వారంటైన్ చేశామని వెల్లడించారు. దిమాపూర్‌లో తొలి కేసు దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
 
ప్రస్తుతం రాష్ట్రంలో టెస్టింగ్ లాబొరేటరీ లేదని, అందువల్లే అనుమానితులకు పరీక్షలు చేసేందుకు నమూనాలను అసోం పంపుతున్నామని తెలిపారు. ఆదివారం వరకూ రాష్ట్రానికి చెందిన 74 నమూనాలను పరీక్షించామని ఆయన అన్నారు. 
 
ఇప్పటివరకూ ఇండియాలోని మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో మాత్రమే ఇంతవరకూ కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. తాజాగా కరోనా సోకిన రాష్ట్రాల జాబితాలో నాగాలాండ్ చేరిపోయింది. ఇక మేఘాలయా రాష్ట్రంలో మాత్రం ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.