టీకా వేయించుకున్న ప్రధాని మోడీ! టీకా వేసిన నర్సు పేరేంటి?
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ఉదయం కొవిడ్ టీకా వేయించుకున్నారు. దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా ఈ రోజు నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి, 45 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగి, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నవారికి టీకా ఇవ్వనున్నారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ప్రధాని నరేంద్ర మోడీ తొలి డోసు టీకాను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన దేశప్రజలంతా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే మనమందరం కలిసికట్టుగా భారత్‌ను కొవిడ్ రహిత దేశంగా తీర్చిదిద్దాలని ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.
కాగా ప్రధాని నరేంద్ర మోడీ భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ టీకాను తీసుకున్నారు. ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో పనిచేస్తున్న సిస్టర్ పి.నివేదా ప్రధానికి టీకా సిరంజ్ ద్వారా ఇచ్చారు. ఈ సందర్భంగా కరోనాపై వైద్యులు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ప్రధాని కొనియాడారు.